జనవిజయంఆరోగ్యంఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది?

ఆరోగ్యం ఎవరి చేతుల్లో ఉంది?

రోగ్యం పాడయ్యాక రోగాలు వస్తాయా? లేదా రోగాలు వచ్చాక మన ఆరోగ్యం పాడవుతుందా? ఆలోచించండి. అందరూ చెప్పే సమాధానం ఏమిటంటే, నాకు అనారోగ్యం వచ్చాకే ఆరోగ్యం పోయింది అని. కానీ ఇది తప్పు. ఆ రోగం రాక ముందు నేను బాగానే ఉన్నాను. ఆ రోగం వచ్చిన దగ్గర్నుండీ నా బతుకు ఇలా అయ్యింది. అప్పట్నుండీ నా ఆరోగ్యం పూర్తిగా పోయింది అని అంటూ ఉంటారు. వాస్తవంగా, మనలో ఆరోగ్యం అనే వెలుగున్నంత కాలం రోగం ప్రవేశించదు. ఆరోగ్యం మనలో తగ్గుతున్నప్పుడు రోగం ప్రవేశిస్తూ ఉంటుంది. రోగం మనలో బీజం వేసుకున్నప్పుడు, ఆ బీజం మెల్లగా మొక్కగా ఎదుగుతున్నప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామే అనుకుంటాము. మనకు అప్పటికి ఏ లక్షణాలు రావు. ఆ రోగ లక్షణాలు క్రమంగా పెరగుతున్నప్పుడు మెల్లగా మనకు సమస్యలు కొద్ది కొద్దిగా తెలుస్తూ ఉంటాయి. అప్పుడు పరీక్షలు చేయిస్తే ఒక్కోసారి రోగంగా అది దొరకవచ్చు. లేదా ఇంకా ముదరక పరీక్షలో ఏమీలేదని రావచ్చు. ఏమీ లేదని రిపోర్టు వస్తే అప్పుడు కూడా మనం ఆరోగ్యంగా ఉన్నామనే అనుకుంటూ ఉంటాము.

కొన్ని రోజులకు ఆ రోగం ముదిరి, పూర్తిగా దాని లక్షణాలన్నీ బయటకు కనిపించి మనల్ని సాంతం మూలపడేస్తుంది. అప్పుడు పరీక్షలలో ఫలానా రోగం అని తేలుతుంది. మనం హాస్పిటల్ లో ఉన్నప్పుడు మాత్రం నాకు అనారోగ్యంగా ఉన్నదని అంటాము. ఇప్పుడు చెప్పండి, అనారోగ్యం వచ్చి ఆరోగ్యం పోయిందా? ఆరోగ్యం పోయి అనారోగ్యం వచ్చిందా? గింజలలో పురుగుపట్టాక రోగనిరోధకశక్తి నశిస్తుందా? లేదా రోగనిరోధకశక్తి ముందు నశించి, అందులో పురుగు చేరడం జరిగిందా? గింజలలో ఏదైతే రోగనిరోధకశక్తి (వెలుగు) ఇంతకాలం ఆరోగ్యం చెడిపోకుండా ఉండడానికి కారణమై నిలిచి ఉందో, ఆ శక్తి క్షీణించిన దగ్గర్నుండీ పురుగుపట్టి అందులో చేరే అవకాశం కలిగింది. అలాగే మనలో కూడా ఆరోగ్యమనేది పోయినప్పుడే ఏ రోగమైనా మనలో ప్రవేశించేది! మనలో ఆరోగ్యం నశించడానికి కారణాలు ఏమిటి? మనకు ఆరోగ్యం చెడిపోవడానికి పరిసరాలు, నీరు, గాలి, అపరిశుభ్రత మొదలగునవి కారణాలా? ఎక్కువమంది ఇవి ఎక్కువ కారణాలని చెబుతారు. కానీ ఇవి 10 శాతం కారణమైతే, 90 శాతం మనలో రోగనిరోధకశక్తి (ఆరోగ్యశక్తి) నశించడమే కారణం. మన శరీరం బలంగా ఉన్నప్పుడు, ఆ చెడును లోపలకు రాకుండా కాపాడుకోగలదు. ఒకవేళ వాటినుండీ ఏమైనా క్రిములు మనలో ప్రవేశించి, బ్రతికి పోషించబడుతున్నాయంటే, మనలో శక్తి నశించటమే కారణం.

మన చేతిలో ఉండే బారెడు శరీరాన్ని మనం లోపల పరిశుభ్రంగా ఉంచుకోలేక, అందులో ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుకోలేక, మొత్తం తనచుట్టూ ఉన్న ప్రపంచమే మారాలని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అది ఎప్పటికీ సాధ్యం కాదు. మన చేతిలో ఉన్నది మనకి సాధ్యం కానప్పుడు, మన చేతిలో లేనిది ఎలా సాధ్యపడుతుంది. అలా అనుకుంటే పరిసరాల పరిశుభ్రత బాగా పాటించే అమెరికా వారికి మనకంటే ఎక్కువ ఆరోగ్యం ఏమన్నా వచ్చిందా? మనకంటే ఆ దేశంలో రోగాలు ఎక్కువ ఉన్నాయి. రోజురోజుకీ బాహ్యమైన శుభ్రత అందరిలోనూ పెరుగుతున్నా ఆరోగ్యం దిగజారిపోతున్నది. అంటే అసలు కారణాలు అవి కాదు. మరి తల్లిదండ్రుల వారసత్వంగా మనకు ఆరోగ్యం పోయిందా? అలా అనుకోవడానికి లేదు. మన కంటే ఎక్కువ ఆరోగ్యంతో,ఎక్కువ శక్తితో తక్కువ సమస్యలతో వారున్నారు. ఆరోగ్యం చెడిపోవడానికి డాక్టర్లు, హాస్పిటల్స్ కారణమంటారా? అది కానే కాదు. ఎందుకంటే మనం ఆరోగ్యం చెడగొట్టుకునే గదా డాక్టర్ల దగ్గరకు వెళ్ళేది. అనారోగ్యం తగ్గడం, తగ్గకపోవడం అనేది మన శరీరస్థితిని బట్టి ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఇంకా కారణాలు చూస్తే, మానసికమైన ఒత్తిడులవల్ల ఆరోగ్యం పోతున్నదా, అంటే అది కొంత కారణమేగానీ పూర్తిగా అదీ కాదు. మరి అసలు కారణం ఎక్కడా ఉండకుండా ఎలా ఉంటుంది. మన ఆరోగ్యాన్ని పాడుచేసే అసలు దొంగ ఎవరు?

ఇంట్లో దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడన్నట్లు గానే, మనకు రోగాలు రావడానికి, హాస్పిటల్స్ పాలు కావడానికి, బాధలననుభవించడానికి కారకులం మనమే. ప్రతి రోజూ మన ఆరోగ్యాన్ని మనం కొంచెం కొంచెం పాడుచేసుకుంటూ చివరకు ఈ స్థితికి వచ్చాము. అందుకే, వాడి ఆరోగ్యాన్ని వాడు చేజేతులారా పాడుచేసుకున్నాడండీ, ఆ కర్మ ఇప్పుడు ఎలా అనుభవిస్తున్నాడో చూడండి, చేసింది. అనుభవించక తప్పుతుందా? ఇలా మన పెద్దవారంటూ ఉంటారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని పూర్వీకులు గ్రహించారు కాబట్టే ఆరోగ్యంగా బ్రతకగలిగారు. ఈ రోజుల్లో ప్రజలకు, ముఖ్యంగా చదువుకున్నవారికి, డబ్బులున్నవారికి మాత్రం మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని అసలు తెలియడం లేదు. అందుకే ఆరోగ్యం ఇంత బాగా చెడిపోయింది. లేచిన దగ్గర్నుండీ పడుకునే వరకూ కొంత టైమన్నా ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటున్నారా? అన్నింటికీ టైము పెట్టి మరీ శ్రద్ధగా చేసుకుంటారు. చదువుకోవడం, సంపాదించుకోవడం, హాయిగా తినడం, హాయిగా తిరగడం, జీవితాన్ని జల్సాగా గడిపివేయడం అందరికీ చేతనౌతున్నది కానీ ఆరోగ్యంగా బ్రతకడానికే టైం లేదు. ఆరోగ్యంగా బ్రతకాలనే కోరికా లేదు. ఇక ఆరోగ్యం ఎలా వస్తుంది?

మన ఆరోగ్యం గురించి ఏ రోజైనా మంచిగా నమిలి తినడానికి టైము పెట్టుకుని, మలమూత్రాదులను పోసుకోవడానికి టైం పెట్టుకుని, వ్యాయామం, ధ్యానం చెయ్యడానికి టైం ఉంచుకుని, పెందలకడనే తినడానికి టైం పెట్టుకుని, పెందలకడనే పడుకోవడానికి టైం పెట్టుకుని, శరీరముపై శ్రద్ధ పెట్టి మనం ఆరోగ్యం కొరకు ప్రయత్నించినది ఏమైనా ఉందా? మనం ఇన్ని విధాలుగా అశ్రద్ధ చేస్తూ ఉంటే తల్లిదండ్రుల నుండి మనకు లభించిన ఆరోగ్యము అలానే జీవితాంతం ఎలా ఉంటుంది? మనం ఏ విధముగా శరీరానికి – సహకరిస్తున్నామని, శరీరం మనకి ఆరోగ్యాన్నిచ్చి సహకరిస్తుంది. ఇచ్చిపుచ్చుకోవడం మర్యాద. మన విషయంలో ఆరోగ్యం పోవడానికి కారణం, మనం శరీరానికి ఇవ్వడమనేది లేకుండా ఏకంగా అంతా తీసుకోవడమే అవుతున్నది. అందుకే ఆరోగ్యం పూర్తిగా రోజు రోజుకీ నశించిపోతున్నది. భూగర్భజలాలను తోడినట్లుగా ఆరోగ్యాన్ని తోడేస్తున్నాము. మనం ఎన్నో రకాలుగా తప్పులు చేస్తున్నందులకు రోగాలు, బాధలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ మనమే మేల్కోవాలి. తప్పు చేసేది మనమే కాబట్టి తప్పు మానాల్సింది. కూడా మనమే. దురద ఒకచోట పుడుతుంటే, గోకుడు. వేరే చోట అయితే సమస్య పరిష్కారానికి రాదు. మన చేతుల్లో ఉన్న ఆరోగ్యాన్ని మనమే తిరిగి బాగుచేసుకోవడానికి ప్రయత్నించడం ఒక్కటే సరైన మార్గం. అందుచేతనే “మీ ఆరోగ్యం మీ చేతుల్లో” అనే మాటను ఈ దశపుస్తకమాలకు పెట్టడం జరిగింది. చేతిలో ఉన్న మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడం ఆరోగ్యవంతుని లక్షణం. ప్రయత్నించండి.

రచయిత: డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు

తదుపరి ఆరోగ్యం ఎలా వస్తుంది? అనే అంశం గురించి తెలుసుకుందాం….

మీ ఆరోగ్యం-మీ చేతుల్లో వ్యాసాలలో ఇంతక్రితం వ్యాసం వైద్యవిధానాల వల్ల మేలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మంతెన ఆరోగ్య సలహాలు అన్నీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

——-

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి