జనవిజయంఆర్ధికంఆర్ధిక చీకట్లు తొలగేదెన్నడో?

ఆర్ధిక చీకట్లు తొలగేదెన్నడో?

దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని దేశంతో పాటు ప్రపంచం కూడా ఎదురుచూస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయితే దాని ప్రభావం ప్రపంచంపైనా పడుతుంది. ఆ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ విజన్ ఉన్న నేతగా కానరావడం లేదు. కేవలం మోడీ ఆదేశాలను అమలు చేసే వ్యక్తిగానే ఆమె పని చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఆర్థికరంగంపై పట్టున్న వారు అయితే మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండేది. గతేడాదే నిర్మలా సీతారామన్ మారుస్తారన్న ప్రచారం సాగినా ఎందుకనో మోడీ నిర్ణయం తీసుకోవడం లేదు. ఆమె స్థానంలో బ్రిక్స్ బ్యాంక్ ఛైర్మన్ గా ఉన్న కె.వి.కామత్ ను తీసుకుని వస్తారన్న ప్రచారం సాగినా ఇప్పుడలాంటి వార్తలు ఏవీ లేవు. లాక్ డౌన్ తో పాటు అంతకు ముందే భారత్ ఆర్థికరంగం దెబ్బతింటూ వస్తోంది. కరోనాతో వృద్ధిరేటు కుదేలయ్యింది. దీంతో భారత్ మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే సమర్థ నాయకత్వం అవసరం అని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. మోడీ రెండవసారి అధికారంలోకి వచ్చి ఇటీవలే రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. కరోనా సంక్షోభానికి కూడా ఏడాదికాలం పూర్తయ్యింది. రెండోసారి అధికారంలోకి వచ్చన వెంటనే ప్రధాని మోడీ కీలక నిర్ణయాలు తీసుకుని ఆర్థిక రంగాన్ని దౌడు తీయిస్తారని అంతా అనుకున్నారు.

కానీ అలా జరగడం లేదు. ఆర్థికరంగంలో చీకట్లు మొదలయ్యాయని, చీకటి సంవత్సరంగా మాజీ ఆర్థికమంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు. ఆయన అన్నట్లుగానే దేశం దుర్భర ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంటోంది. నిజానికి ఇలాంటి సమయంలో పలువురి సూచనలు సలహాలు తీసుకోవాల్సిన ప్రధాని ఎందుకనో ఎవరినీ పట్టించుకోవడం లేదు. కనీసం మంత్రులతో అయినా చర్చిస్తున్నారా అన్న భరోసా కలగడం లేదు. ఒంటరిగానే ప్రధాని మోడీ తను అనుకున్న మార్గంలో పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. కరోనా రెండోదశలో ప్రజల జీవనం భారంగా మారింది. ఆర్థిక వ్యవస్థ చితికి పోయింది. ప్రజల కొనుగోలు శక్తి లేకుండా పోయింది. దీనికి తోడు ధరలు దాడి చేస్తున్నాయి. పెట్రో, గ్యాస్ ధరలు సామాన్య, మధ్యతరగతి ప్రజలకు నిద్దుర లేకుండా చేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు హద్దూ పద్దూ లేకుండా పెరుగుతున్నాయి. ధాన్యం దిగుబడులు పెరుగుతున్నా ధరలు మాత్రం తగ్గడం లేదు. మార్కెట్లో ధరలను ఎవరు కంట్రోల్ చేస్తారో తెలియకుండా ఉంది. జరుగుతున్న పరిణామాలు చూస్తే మోడీ ఒక్కడే నాయకుడు అన్న రీతిలో నిర్ణయాలు సాగుతున్నాయి. తన ఎజెండాను అమలుచేసే విషయంలో మోదీకి అమిత్ షా ఎంత ముఖ్యమో, నిర్మలా సీతారామన్ అంతే ముఖ్యమని, ఇరువురినీ ప్రధానమంత్రి కార్యాలయమే నిర్దేశిస్తుందని అర్థమవుతోంది. మోదీ హయాంలో మంత్రులంతా నామమాత్ర మేనని అర్థం అవుతోంది.

రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం కావడం.. వ్యాపార సంస్థలు, బ్యాంకులు దివాళా తీస్తూ ఆర్థిక సంక్షోభం తీవ్రతరమవుతున్న వేళ కరోనా విపత్తు దేశాన్ని తాకింది. దీంతో ఆర్థికరంగం మరింతగా దిగజారింది. అంతేనా అంటే తీసుకున్న చర్యలు దేశంలోని ఏ ఒక్కరినీ సంతృప్తి పరచడంలేదు. దేశమంతటా ఏకం చేయగలిగిన భారాన్ని భుజాని కెత్తుకున్ననేతగా కనిపించిన మోదీకి కరోనా సంక్షోభం కలని వచ్చిందనే చెప్పాలి. ఆర్థిక సంక్షోభం గురించి ప్రజలు మరచిపోవడమే గాకుండా మోడీని సమర్ధ నేతగా ఊహించుకున్నారు. గతేడాది ప్రకటించిన రూ.20లక్షల కోట్ల ప్యాకేజీ వల్ల ఒరిగిందేమీ లేదని.. జీవనోపాధి కోల్పోయిన లక్షలాది మంది తిట్టుకుంటున్నారు. ఇ.ఎం.ఐలు వాయిదా వేసినా వడ్డీ భారం తడిసి మోపెడు అవుతున్నా సర్కార్ లో చలనం రావడం లేదు. కనీసం ఇలాంటి వెసలుబాట్లు కూడా ఇచ్చి ప్రజలను కాపాడుకోవాలన్న ఆలోచన చేయడం లేదు. వలస కార్మికుల జీవితాలు మారతాయని, జీతాలు, ఉద్యోగాల కోతతో క్రుంగిపోయిన మధ్యతరగతి మానసిక వ్యధలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ భారీ ఎత్తున ఊపందుకుంటుందనీ 20లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటిం గానే అంతా భ్రమించారు. వినడానికి గరీబ్ కళ్యాణ్ యోజన పేరు బాగున్నా గరీబోళ్ల బతుకులు మారలేదని అర్థం అవుతోంది. పాలనా విధానాల్లో మార్పులు లేకుండా ..ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందా అన్నది కూడా అనుమానమే. ఇకపోతే రెండవసారి అధికారంలోకి వచ్చాక రెండేళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఇంతవరకూ పేదలు, సామాన్యులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలేవీ ఫలితం ఇవ్వలేదు. గోదాముల్లో ఆహార ధాన్యాలు కుళ్లిపోతుంటే వాటిని ఆకలితో అలమటిస్తున్న పేదలకు పంచడం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చి ఏడేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కాలంలో జరిగిన బృహత్తరమైన మార్పులు ఉన్నాయా అంటే అవీలేవు. 370 రద్దు, కాశ్మీర్ స్వయంప్రతిపత్తిని కాదని లదాఖ్ విభజన, ట్రిపుల్ తలాక్, అయోధ్య వివాద పరిస్కారం వంటివి చారిత్రాత్మక నిర్ణయాలే అయినా అవేవీ పేదల ఆకలి తీర్చలేవని, నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేవని గుర్తించాలి. ఈ ఏడేళ్లలో మోదీ ప్రభుత్వం వీటినే పదేపదే చూపించి సాధించిన విజయాలుగా ప్రచారం చేసుకుంటోంది. అయితే ఇవేవీ పేదల కాలే కడుపుల ఆకలిని తీర్చలేవు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ పనిచేసినా దానికొక నిర్దిష్ట లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్య సాధనకు అనుగుణంగా వ్యవస్థల్నీ, చట్టాల్ని మార్చుకోవడం, అవి మారడానికి తగిన చర్యలు చేపట్టడం పద్ధతి ప్రకారం జరుగుతుంటుంది. స్వచ్ఛ భారత్, సబ్ కాసాథ్- సబ్ కా విశ్వాన్, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్మార్ట్ సిటీస్, బేటీ పడావో- బేటీ బచావో వంటి రకరకాల పేర్లను ఖాయం చేసి మార్కెట్లో వదిలినా మార్పు రాలేదు. కోట్లాది మందిని విశ్వాసంలోకి తీసుకుని, అభివృద్ధిలో వారిని భగస్వాములను చేయలేదని అర్థమవుతోంది. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసే సమర్థ చర్యలు తీసుకోవడంలో మోడీ విఫలం అవుతున్నా .. తన వైఫల్యాలను ఆయన అంగీకరించే పరిస్థితుల్లో లేరు. ప్రభుత్వాలు కూడా ప్రజలకు ఉపాధి కల్పించే రంగాలపై దృష్టి సారించాలి. వారిని ఆదుకునే చర్యలను పెద్ద ఎత్తున చేపట్టాలి. అవసరమైతే ఆర్థికంగా ఆదుకోవాలి. విదేశాల్లో మాదారిగా నగదు బదిలీ చేయాలి. అప్పుడే ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయి.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి