Saturday, February 24, 2024
Homeరాజకీయంఏ.పిలో అనూహ్యంగా పెరుగుతున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌

ఏ.పిలో అనూహ్యంగా పెరుగుతున్న కాంగ్రెస్‌ గ్రాఫ్‌

  • రేపటి ఎన్నికల్లో కమ్యూనిస్టులు కూడా తోడు
  • బహుముఖ పోటీ దిశగా ఎపి రాజకీయాలు

అమరావతి,ఫిబ్రవరి9(జనవిజయం):

విభజన తరవాత ఆంధ్రప్రదేశ్‌ రాష్టాన్రికి బిజెపి ద్రోహం చేసిందన్న పాయింట్‌ విూదే కాంగ్రెస్‌ తన ప్రచారాన్ని ఉధృతం చేస్తోంది. షర్మిల కాంగ్రెస్‌ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్‌ అనూహ్యంగా పోటీలోకి దూసుకుని వచ్చింది. బిజెపిపట్ల వైయస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం వైఖరి ఏమిటి అనేదాన్ని బట్టి ఆ పార్టీల పట్ల కమ్యూనిస్టుల వైఖరి ఉంటుంది. అదే సమయంలో అధికారంలో ఏ పార్టీ ఉన్నా ప్రజావ్యతిరేక విధానాలు అనుసరిస్తుంటే రాజీ పడకుండా కమ్యూనిస్టులు పోరాడుతున్నారు. దీంతో ఎపిలో రాజకీయాలు క్రమంగా మారుతున్నాయి. బిజెపి, టిడిపి, జనసేన కలిసి పోటీ చేస్తే కమ్యూనిస్టులు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ప్రకటించరు. వారు ఖచ్చింతంగా కాంగ్రెస్‌తో కలసి పోరాడుతారు. అలాగే

వైసిపి కూడా ఒంటరి పోరుకు దిగుతోంది. అప్పుడు త్రిముఖ పోరు సాగనుంది. గత అనుభవ పాఠాల కారణంగా కమ్యూనిస్టులు టిడిపిని కూడా దూరం పెట్టనున్నాయి. నూతన ఆర్థిక విధానాలు, మతోన్మాదానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను కూడగట్టాలని సిపియం నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఇండియా కూటమిలో భాగంగా కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలసి పోవడం ఖాయం కానుంది. రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కూడా కార్పొరేట్‌ శక్తుల ప్రయోజనాలను కాపాడటంలో మోడీకి ఏవిూ తీసిపోవటం లేదు. అదానీ, అంబానీల స్థావరంగా ఎపి మారింది. గంగవరం పోర్టు వాటాను అదానీపరం చేయటం తాజా ఉదాహరణ. కృష్ణపట్నం ఓడరేవు ఎప్పుడో వారి పరమైపోయింది. అలాగే ఏపీ రాష్టాన్రికి చెందిన పలు కార్పొరేట్‌ శక్తులు జాతీయ స్థాయికి ఎదిగాయి. వారికీ కార్మికోద్యమాల పొడగిట్టడం లేదు. ఈ విధానాలను వ్యతిరేకిస్తున్న కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని, ప్రతిష్టను దెబ్బ తీయడం ద్వారా కార్పొరేట్ల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నాల్లో అధికార వైసిపి ఉందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తూనే ఉన్నారు.

పైకి ఏమి చెప్పినా అసలు రహస్యం అదే. ఉద్యోగులలో అసంతృప్తి లేదని, కమ్యూనిస్టులు ఇంకా ఎక్కడ ఉన్నారని చెప్తున్న వారే పనికట్టుకొని కమ్యూనిస్టులపై పథకం ప్రకారం దాడి చేస్తున్నారంటేనే వాస్తవమేమిటో అర్ధమవుతుంది. ఆర్థిక సంస్కరణలు ఊపుగా వున్న కాలంలో కమ్యూనిస్టులు బలహీనపడ్డారు. కాని ఇప్పుడు ఒకదాని వెంట ఒకటిగా ఆర్థిక సంక్షోభాలు పెట్టుబడిదారీ వర్గాన్ని చుట్టుముట్టాయి. అనేక దేశాల్లో ప్రజా ఉద్యమాలు పెరుగుతున్నాయి. పాలకులు మారిపోతున్నారు. కార్పొరేట్‌ శక్తులు ఈ ప్రమాదాన్ని గుర్తించి రాజకీయాలపై తమ పట్టును పెంచాయి. ఈ క్రమంలోనే మరోసారి కమ్యూనిస్టు వ్యతిరేక ప్రచారానికి తెరలేపారు. మారుతున్న పరిస్థితులను గుర్తించడానికి ఈ పార్టీలు నిరాకరిస్తున్నాయి. మొండిగా అధికారాన్ని కాపాడుకోవటానికి పెత్తందారీ, నిరంకుశ పోకడలు అనుసరిస్తున్నాయి.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా బిజెపి చేసిన ద్రోహం ప్రజలపై బలమైన ముద్ర వేసింది. తమ రాజకీయ ప్రాబల్యం కోసం మతోన్మాద ఎజెండాను రుద్దాలని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. బిజెపి కేంద్ర నాయకులు సైతం దిగి దీనికి ఊతం ఇస్తున్నారు. గుడిని, గోపురాలను, రథాలను, కట్టడాలను వివాదం చేసి మత విద్వేషాలను పెంచాలని చూశారు. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం వారికి లొంగిపోయి మతోన్మాద రాజకీయాలకు వంత పాడుతున్నాయి. బిజెపి మతోన్మాద ఎజెండాకు ప్రజా ఉద్యమాలు చెక్‌ పెడుతున్నాయి. బిజెపి విచ్ఛిన్న రాజకీయాలకు సవాలుగా నిలబడిరది కమ్యూనిస్టులే. అందుకనే మతోన్మాద శక్తులకు కమ్యూనిస్టులంటే కడుపు మంట. అటు కార్పొరేట్‌ ప్రయోజనాలు, ఇటు మతోన్మాద బిజెపి ఒత్తిళ్ళు కమ్యూనిస్టులపై దాడికి ఉసిగొల్పుతున్నాయి. బిజెపి ద్రోహంపై ఒక్కసారి కూడా నోరు విప్పని జగన్‌ మోహన్‌ రెడ్డి పనిగట్టుకొని కమ్యూనిస్టులపై దాడికి దిగారు. నేరుగా కమ్యూనిస్టులపై విమర్శలు చేస్తే ప్రజలు సహించరు కాబట్టి అప్రతిష్టపాలైన తెలుగుదేశంతో ముడిపెట్టి కమ్యూనిస్టుల ప్రతిష్టను మసకబార్చాలనే ప్రయత్నం వైయస్‌ఆర్‌సిపి చేస్తున్నది.

రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సిపి, తెలుగుదేశం పార్టీలు ఒకరి పొడ అంటే మరొకరికి గిట్టనట్లుగా కనిపిస్తుంటుంది. కృష్ణపట్నం జెన్‌కోను రాష్ట్ర ప్రభుత్వం అదానికి ధారాదత్తం చేస్తున్నది. సహకార చెక్కర, పాల సంఘాలను రెండు పార్టీలు దెబ్బతీశాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను మాటవరసకు వ్యతిరేకిస్తున్నప్పటికీ గట్టిగా నిలబడి తెగువతో పోరాటానికి రావటం లేదు. ప్రత్యేక హోదాను పక్కనపెట్టి ఇద్దరూ కీచులాడుకుంటున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు సంక్షేమ పథకాలను పోటీలు పడి ప్రకటిస్తుంటారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాటగా వీరి తీరున్నది. ఎవ్వరు అధికారంలో ఉన్నా ఈ విధానాలపై పోరాటంలో కమ్యూనిస్టులు ముందున్నారు. వివిధ వర్గాలు, తరగతులు చేస్తున్న పోరాటాలకు అండగా ఉంటున్నారు. అదే కమ్యూనిస్టు పార్టీలు ఇప్పుడు పోరాటాలు చేస్తుంటే వైయస్‌ఆర్‌సిపికి కంటగింపుగా వుంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అనూహ్యంగా దూసుకుని రావడంతో కమ్యూనిస్టులు కూడా రేపటి ఎన్నికల్లో కలసి పోరాడడం ఖాయం కానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments