ఖమ్మం, జూలై 28(జనవిజయం): పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు భోజన, వసతి సౌకర్యం తో పాటు అన్ని మౌళిక వసతులు కల్పించాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టర్, పోలీస్ కమీషనర్ తో నయాబజార్ ప్రభుత్వ పాఠశాల, రామ్ లీల ఫంక్షన్ హాళ్లలో ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భోజనం, త్రాగునీరు, వసతులు పరిశీలించి, ముంపు బాధితులతో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భోజనం, సురక్షిత త్రాగునీరు అందించాలన్నారు. పారిశుద్ధ్యం పాటించాలని, టాయిలెట్స్ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కేంద్రం పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూడాలని, వ్యర్థాలు వెంట వెంటనే తొలగించాలని వారు అన్నారు. పునరావాస కేంద్రం పరిస్థితి చక్కబడే దాకా ఉంటుందని, ఇప్పుడే ఇండ్లకు వెళ్లి, ఇబ్బందులు పడవద్దని వారు అన్నారు. ఇండ్లలో క్రిమికీటకాలు, విష సర్పాలు చేరవచ్చని జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలక్ట్రానిక్ పరికరాలు తడి ఉండగా ఆన్ చేయడం లాంటివి చేయవద్దని వారు అన్నారు. తీగలపై బట్టలు ఆరవేయడం చేయకూడదని, విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.నయాబజార్ ప్రభుత్వ పాఠశాలలోని పునరావాస కేంద్రంలో కలెక్టర్, సిపి లు భోజనం మధ్యాహ్న భోజనం చేశారు.ఈ సందర్భంగా ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, అధికారులు, తదితరులు ఉన్నారు.