– నాగపూర్ టూ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేలో రైతులకు అన్యాయం
– బలవంతంగా లాక్కోవడం సమంజసమేనా…?
– మార్కెట్ రేటు ప్రకారమే నష్టపరిహారం చెల్లించాలి
– ఆందోళన చేసిన రైతులను అరెస్ట్ చేయడం అక్రమం
– రాష్ట్ర ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం
ఖమ్మం, ఆగష్టు 12 (జనవిజయం): నాగపూర్ టూ అమరావతి గ్రీన్ ఫీల్డ్ హైవే సర్వేలో తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నోరు విప్పడం లేదని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా రఘునాథపాలెం మండలంలో జరుగుతున్న సర్వే సందర్భంగా ఆయన స్పందించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా హైవే నిర్మాణలకు అవసరమైన భూసేకరణ బాధ్యత, పరిహారం ఎంత ఇవ్వాలనే నిర్ణయాధికారం రెండూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలన్నారు. అలాంటి రాష్ట్ర ప్రభుత్వం కోకా పేట లాంటి చోట ప్రభుత్వ భూములను ఎకరం వందకోట్లకు అమ్మి ఆదాయం పొందిందన్నారు. కానీ రైతుల వద్ద సేకరించిన భూమికి మాత్రం కనీసం ఎకరాకు ఇరవై లక్షలు కూడా ఇవ్వని దౌర్భాగ్య పరిస్థితి తెలంగాణలో ఉందన్నారు.