జనవిజయంసాహిత్యంఆలోచనా ధోరణి మారకుంటే అనర్ధాలే!

ఆలోచనా ధోరణి మారకుంటే అనర్ధాలే!

నా మాట – 6

‘గదినీ, మదినీ తెరిచి అన్ని పవనాలనీ ఆహ్వానించాలని’ దేవరకొండ బాలగంగాధర తిలక్ అన్న మాట ప్రస్తుత సందర్భంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉందనిపించింది. ఇప్పుడంతా గదులు తెరుస్తున్నారు కానీ మదిని తెరవడం లేదనిపిస్తోంది ఇప్పుడొస్తున్న కవిత్వాన్ని చదువుతుంటే. అంతేగాకుండా పలు పరదాలను మనసుకు కప్పుకుని కవిత్వం రాస్తున్న వారూ లేకపోలేదు. స్త్రీవాద కవిత్వం రాసే వారు స్త్రీని గౌరవిస్తున్నారా? అంటే ఏమో చెప్పలేం. గౌరవించడం లేదంటే ఆయన మనసుకు ఆ పరదా కప్పుకున్నట్టే కదా. సమస్యను ఎత్తిచూపుతూ పరిష్కారం కోసం రచనలు చేసేవారు తన వ్యక్తిగత విషయంలో మాత్రం ఆచరణాత్మకంగా లేకపోవడం నేరమే. ఈ మధ్యకాలంలో ఇలాంటి కవిత్వమే అధికంగా వస్తోందనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.

‘ఈ మధ్య ఒక సెమినార్ పెట్టామండి. చాలా మంది కవులు హాజరు కాలేదు. ఎంచుకున్న సబ్జెక్ట్ మంచిదే. వక్త కూడా ఘటికుడే. ఎందుకో కవులు భారీగా హాజరు కాలేదు. అందుకే మరోసారి సెమినార్ నిర్వహిస్తున్నాము. మీరు తప్పకుండా హాజరు కావాలంటూ’ మిత్రుడు చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. తనకు కావాల్సింది తీసుకుని మిగతా విషయాలు మరిచిపోతాడంట మనిషి. త్రివిక్రమ్ సినిమాలో డైలాగ్ గుర్తొచ్చింది. ప్రస్తుతం చాలా మంది కవులు తను రాయాలనుకున్న అంశంపై రిసెర్చి చేశాక తన పాండిత్యాన్ని చూపుతున్నారు. మరో అంశం అవసరమైనప్పుడు మళ్లీ పుస్తకాలు తిరగేయడం చేస్తున్నారు. దీని వల్ల వర్ధమాన రచయితలు ఎదుగుతారని నేననుకోవడం లేదు. వర్ధమాన రచయితలే కాదు సాహిత్యంలో తల పండిందని చెప్పుకునే వారికీ ఈ తరహ పోకడ వుంటే వారు ఎన్నటికీ రాణించలేరు. మంచి విషయాలపై చర్చావేదికలు నిర్వహిస్తే చాలా మంది హాజరు కాకపోవడం వెనుక నేర్చుకోవాలనే తపన, తెలుసుకోవాలనే జిజ్ఞాస, అభిరుచి లేకపోవడం, తనకు మొత్తం తెలుసుననే భ్రమలో విహరించడమే కారణం.

ఇదే విషయాన్ని ఓ సాహితీ దిగ్గజం వద్ద నా అభిప్రాయం వెలిబుచ్చితే నిర్మొహమాటంగా ఖండించాడు. నీవు కార్యక్రమం పెట్టినప్పుడు ఆ కవి ఏ పరిస్థితుల్లో ఉన్నాడు. అతని చుట్టూ ఉన్న వాతావరణం సహకరించేలా ఉందా లేదా అనే విషయాలు కూడా గమనంలోకి తీసుకోవాలి. నాణేనికి ఒక వైపే చూసి అభిప్రాయపడితే ఎలా అన్నాడు. అంతేనంటారా గురువు గారు అన్నాను సందేహం వ్యక్తం చేస్తూ. అంతేకాదు ఈవాళ సాహిత్యంలోకి కలుషిత రాజకీయాలు ప్రవేశించాయి. ఆ సంస్థ చేస్తే ఈ సంస్థకు చెందిన వారు రారు. ఈ సంస్థ చేస్తే ఆ సంస్థ వారు రారు. ఎవరి దారి వారిది. ఇది కూడా మనం పరిశీలించి బేరీజు వేసుకోవాలి అన్నాడు. అదేంటి గురువుగారూ… సాహిత్యంలో రాజకీయాలా…? ప్రశ్నార్థకంగా ఉన్న నా మొఖాన్ని చూసి మళ్లీ ఆయనే చెప్పడం ప్రారంభించాడు.

రాజకీయం రకరకాలుగా ఉంటుంది. ప్రాచీన కాలంలో రాజులను దైవాంశసంభూతులుగా కీర్తిస్తూ రచనలు వచ్చాయి. తర్వాత ఆధ్యాత్మికను పెంచేలా రచనలు సాగాయి. ఆ తర్వాత మనుగడ కోసం రచనలు వచ్చాయి. ఇదంతా చరిత్ర. కాలక్రమేణా ఒక అంశం ముగిసి మరో అంశం ముందుకొచ్చింది. నేటి ఆధునిక కాలంలో అన్ని అంశాలూ ఉన్నాయి. భజన సాహిత్యం ఉంది. భక్తి సాహిత్యం ఉంది. భరోసా సాహిత్యం ఉంది. విప్లవ సాహిత్యం ఉంది. ఊహ సాహిత్యం కూడా వస్తోంది. అస్తిత్వ వాద సాహిత్యం రాటుదేలుతోంది. ఇందుకు సమాజంలో జరుగుతున్న పరిణామాలు, వైరుధ్యాలు కారణం. పరస్పరం ఘర్షణ ఉంటే దాని నివారణకు సాహిత్యం పని చేస్తుందనేది కొంతమంది ఆలోచన. ఆ ఘర్షణను పరిష్కారం వైపు తీసుకెళ్లేందుకు సాహిత్యం పని కొస్తుందని నమ్మేవారు కొందరు. ఇప్పుడు సరళీకరణ ఆర్థిక విధానాల వల్ల సామూహిక ఘర్షణలు తగ్గిపోయాయి. ఎప్పుడైతే అస్థిత్వవాదం పెరిగిపోయిందో ఎవరికి వారే యమునా తీరే అన్న చందాన సమాజం మారిపోయింది. సమాజంలోని వ్యక్తులే కదా కవులంటే. అందుకే సాహిత్యంలోకి కలుషిత వాతావరణం ప్రవేశించిందంటూ పెద్దాయన చెప్పుకుంటూ పోతున్నాడు. మరి వీటిని తగ్గించే మార్గం లేదా అన్నాను ఎలాగైనా కలుషిత వాతావరణాన్ని ఖతం చేయాలనే ఆలోచనతో. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెబుతుందన్నాడు.

కాలం ఎన్ని ప్రశ్నలకని సమాధానం చెబుతుంది. మనమెందుకు చెప్పలేకపోతున్నామో ఆలోచించాలి. మన కళ్లల్లో ఎదుటివారు దుమ్ము కొడితే సుడిగాడుపనే భ్రమలో మనం ఉన్నాం. నిజంగానే సుడిగాలి దుమ్ము రేపితే ఎవడో కొట్టాడనే ఆలోచనలో ఉంటున్నాం. ఈ భ్రమల్ని వదిలేలా ఆలోచించకపోతే కవులుగా మనం సమాజానికి నాయకత్వం వహించలేం. కొంత మంది కవులు మాత్రం ఏ ఒక్క అవకాశం వచ్చినా కిందివారిని తొక్కేయాలనే చూస్తుంటారు. ఒక వ్యక్తి మన దగ్గరకు వచ్చి ఒక విషయాన్ని అడిగాడంటే మన మేధోసంపత్తిని పరీక్షించడానికే ప్రశ్న వేశాడని అనుకోవద్దు. అతనికి తెలియనిది తెలుసుకోవడానికి అడిగాడని మనమెందుకు అనుకోకూడదు. మన పూర్వీకుల సాహిత్యాన్ని, వర్ధమాన రచనల్ని అధ్యయనం చేయకపోతే ఇలాంటి ప్రశ్నలే, ఇలాంటి ఆలోచనలే మన మెదళ్లని తొలిచేస్తుంటాయి.

నేను సాహిత్యంలో పెద్ద కొండలాంటివాడిని. నా దగ్గర లేనిదేదీ లేదు. నీవెంత పొట్టేలు లాంటివాడివి అంటూ కొంతమంది కుహనా మేధావులు లెక్కలేసుకుంటుంటారు. కదల్లేని ఆ కొండను తొలిచివేస్తున్న ఘటనలు జరుగుతున్నాయని, పొట్టేలు ఎక్కడికైనా తిరిగి రాగలదని పాపం ఆయనకు తెలియదు. వేమన గారు చెప్పినట్టు ఎంత కొండైనా అద్దంలో కొంచెమే అవుతుందిగా. వాస్తవ పరిస్థితులను అంచనా వేయకుండా కలుషిత బురదలో దిగితే మన మెదళ్లకు అంటకుండా ఉంటుందా అనేది మనం గ్రహించగలగాలి.

చిన్నప్పుడు మనం చదువుకున్న చిన్న కథను గుర్తు చేసుకుందాం. మోపు కట్టినప్పుడు పుల్లలను విరవలేము. అదే మోపు విప్పితే ఒక్కొక్కదాన్ని సులువుగా విరిచేయవచ్చు. ఇప్పుడు ప్రజలు రకరకాలుగా విభజించబడి ఉన్నారు. ఆంగ్లేయులు నేర్పిన సూత్రాన్ని తుచా తప్పకుండా నేటి పాలకులు పాటిస్తున్నారు. ఆ ప్రజలకు మార్గదర్శకత్వం వహించే కవులు, రచయితలు కూడా విభజన చట్టాన్ని అమలు చేస్తున్నారు. అందుకే ఎవరికి వారు సామ్రాజ్యాన్ని సృష్టించుకుని ఏలేందుకు శకుని పాఠాలను వల్లెవేస్తున్నారు. ఇదే సరైన సమయమని గద్దెనెక్కిన పాలకులు వారికి అవసరమైన చట్టాలు తీసుకొస్తూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. ఆ సామాన్యుల్లో కవులు కూడా ఉన్నారనుకోండి. నలుగురిగా చీలిపోయాక, సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించాక కొండ లాంటి పాలకులు పొట్టేళ్లను మింగేయకుండా ఉంటారా. అందుకే దబోల్కర్ లేడు. గౌరీ లంకేష్ కనబడడం లేదు. ఆ జాబితాలో మరో కవి చేరకుండా ఉండాలంటే ఐక్యమత్యాన్ని చాటాలి. సమాజానికి మనమే దిక్చూచి అనే విషయాన్ని పాలకుడికి తెలియజెప్పాలి. అలిశెట్టి ప్రభాకర్ చెప్పినట్టు… అడుగంటిన కిరసనాయిల్ స్టవ్తో అన్నం ఎట్టా ఉడికించాలో కవులకు తెలిసుండాలి. గాడి తప్పిన సమాజాన్ని సరైన మార్గంలోకి నడిపించేందుకు కలాన్ని ఝులిపించాలి. అంతకంటే ముందు మన ఆలోచనాధోరణి మారాలి.

ప్రజలు నేడు ధరలతో ఇబ్బందులు పడుతూ బతుకును సాగదీస్తున్నారే తప్ప తిరగబడడం లేదు. వారిని తిరగబడేలా చేయడంలో కవులుగా, రచయితలుగా మన పాత్ర మనం పోషించడం లేదు. ధరలకు వ్యతిరేకంగా ఆందోళన జరుగుతుంటే చూస్తూ వెళ్లిపోతున్నారే కాని సామాన్యులు ఒక్క నిమిషం ఆగి అందులో పాల్గొనలేకపోతున్నారు. అందుకు రకరకాల కారణాలుండొచ్చు. ధరల పెరుగుదలతో ఆందోళన చేస్తున్న వారూ ఇబ్బంది పడుతున్నారు. చూసి వెళ్లిపోయే వారూ ఇబ్బంది. పడుతున్నారు. ఎందుకు జనం ఆందోళన వైపు మొగ్గు చూపడంలేదనేది మనం ఆలోచించాలి. వారిని కదనరంగంలోకి దూకేలా చేయగలగాలి. ఒకప్పుడు ఉల్లి ధర పెరిగితే ప్రభుత్వాన్నే ప్రజలు కూల్చేశారు. ఇప్పుడు ఎందుకు కూల్చడం లేదంటే… సమాజంలో ఎవరి పాత్ర వారి పరిధి మేరకు పోషించడం లేదనే భావించాలి. ‘జీవితమంటే ఊడిగం చెయ్యటం/కాదు ఉద్యమించడం’ అన్న – అలిశెట్టి ప్రభాకర్ మాటల్ని మనం గుర్తు చేయాలి. ఆ తరహాలో మనమూ రాయాలి. అందుకు సమాజంలో జరుగుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిణామాలను సునితంగా పరిశీలించగలగాలి.

ఫోన్ మోతతో మెలకువ వచ్చింది. ఇదంతా కలనా. చక్కటి వ్యాసం రాశాను. గుర్తుకొస్తుందా అనుకుంటూ మళ్లీ నిద్రకు ఉపక్రమించాను. ఆ కల మళ్లీ నా దరిదాపుల్లోకే రాలేదు. ఉదయం వచ్చే కలలు నిజమవుతాయని పెద్దలంటుంటారు. నా కల నిజమైతే ఎంత బాగుండు అనుకుంటూ మహాప్రస్థానం పుస్తకాన్ని తిరగేశాను.

– నామా పురుషోత్తం
98666 45218

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి