– పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమి, కట్టిన ఇల్లు అమ్ముకొని గెంటేశాడు
– విలేకరుల సమావేశంలో న్యాయం చేయాలని వేడుకుంటున్న బాధిత మహిళా మన్నెపల్లి రోజా
ఖమ్మం, ఆగస్టు 4(జనవిజయం): అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలు పుట్టినంకా కూడా అక్రమ సంబంధం పెట్టుకొని భర్త మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఖమ్మం అర్బన్ మండలం వైఎస్ఆర్ కాలనీకి చెందిన మన్నెపల్లి రోజా ఆరోపించారు. శుక్రవారం ఖమ్మం ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2002 మే 14న వివాహం జరిగి ఇద్దరు ఆడ పిల్లలు కలిగిన తర్వాత తన భర్త అక్రమ సంబంధం పెట్టుకొని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని, తనకు పసుపు కుంకుమ కింద ఇచ్చిన భూమిని, బంగారం, వెండిని అమ్ముకున్నాడని, కష్టపడి కట్టుకున్న ఇల్లును కూడా అమ్మేశాడని ఆరోపించింది. పోలీసులకు, మహిళా కమీషన్ కు పిర్యాదు చేశానని తెలిపింది. జిల్లా అధికారులు విచారణ జరిపి తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకొంది. ఈ విలేకరుల సమావేశంలో నిమ్మతోట కనకరత్నం, ఆరోగ్యమ్మ, అరికోట్ల జాన్ పుల్లయ్య పాల్గొన్నారు.