జనవిజయంసాహిత్యంఅధ్యయనంతో లాభాలు మెండు..!

అధ్యయనంతో లాభాలు మెండు..!

‘నా ‘మా’ట – 4

నా’మా’ట ద్వారా అందరినీ చైతన్యపరుస్తూ.. ఏ చిన్న లోపం ఉన్నా సరి చేసుకునేలా అవగాహన కల్పిస్తూ.. అనతికాలంలోనే ఉన్నత శిఖరాలను అధిరోహించిన నామా గారు తనకొచ్చిన జ్ఞానపీఠ్ అవార్డును అందరికీ అంకితం చేయడం గొప్ప విషయం. ఎవ్వరూ చేయలేని సాహసం ఇది. చిన్న చిన్న పురస్కారాలకు ఉప్పొంగిపోయే వారున్న ఈ లోకంలో ఓ గొప్ప అవార్డును ఇలా అంకితం చేస్తూ సాధారణ వ్యక్తిగా మన మధ్య ఉండడం నిజంగా ప్రశంసనీయం. వారి చిత్రపటానికి మన సాహితీ సంస్థల ఆధ్వర్యంలో పాలాభిషేకం, పూలాభిషేకం చేయడం గర్వంగా ఉంది. వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియచేస్తున్నాను. ఇప్పుడు నామా గారి చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుందని వక్త విన్నవించగానే అందరూ ఇక్కడి ప్లెక్సీ వద్దకు వెళ్లారు.

జూమ్ లో చూస్తున్న నాకు పట్టలేనంత సంతోషం కలిగింది. నేను చూస్తుండగానే అంతా నా చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. నిజంగా నాకీ రోజు పర్వదినం. చిత్రపటం కాదు..నేనే పాలతో తడిసి ముద్దవుతున్నట్లు ఆ క్షణం అనిపించింది. ట్యాంకర్ పాలు తెప్పించి వర్షం కురిపిస్తున్నారు, ఆ దృశ్యాన్ని చూస్తుంటే మేని పులకించిపోయింది. పరవశంతో కళ్లు మూసుకున్నాను.

ఏవండీ..! ఫోన్’ అంటూ వినిపించేసరికి కళ్లు తెరిచాను. ఫోన్ తో ఉన్న శ్రీమతి కనిపించింది. నాకు పాలాభిషేకం చేస్తుంటే ఎటెల్లావు. మంచి దృశ్యాన్ని మిస్ అయ్యావు అంటూ ఒకింత అసహనం వ్యక్తం చేశాను. ఏమైందండి అంటూ ఫోన్ పక్కనెట్టి చేయి ఊపింది. ఫోన్ మోగుతున్న ధ్వని నా చెవులకు చేరి ఉక్కిరిబిక్కిరి చేసింది.

పట్టపగలే కలలు కంటున్నారా… అవే మిగిలాయి లేండి అంటూ అక్కడినుండి శ్రీమతి వెళ్లిపోబోయింది. ఇదంతా కలా..! నిజమైతే బాగుండు అనుకుంటూ ఇంతకూ ఏం కల వచ్చిందో అడగవేమిటి అంటూ హుషారుగా అన్నాను. నా హుషారు చూస్తుంటే మంచి కలే వచ్చిందనుకుంటున్నావా అలాంటిదే. నాకు పాలాభిషేకం చేస్తున్నారు….ఆనందంతో ఉప్పొంగుతూ చెప్పాను. ఎన్నో పాలాభిషేకాలు చూసాను. అందులో ఇదొకటి. జరిగే వాటి గురించి ఆలోచించు…అంటూ వెళ్లిపోయింది. ఇప్పుడు చాలా పాలాభిషేకాలు జరుగుతున్నాయి. అవి జరిగేవి కావా…ఈమెకన్నీ అనుమానాలే…అనుకుంటూ పదే పదే మోగుతున్న ఫోనెత్తాను.

సర్.. నిన్నటి వారంలో లక్ష్మణుడు ఎందుకు నవ్వాడో తెలుపలేదు. ఎవ్వరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు. మీరేతైనే చెబుతారని ఫోన్ చేస్తున్నాను అన్నాడు అవతల వ్యక్తి. మీకు ఉందా ఆ అనుమానం.

అందరినీ అడగడం ఎందుకు? రామాయణం చదివితే సరిపోతుందిగా అనుకున్నాను. వాస్తవమే. చాలా మంది తన అనుమానాన్ని ఇతర వ్యక్తుల వద్ద వెల్లడించి నివృత్తి చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. తప్పులేదు. కానీ సొంతంగా తెలుసుకునే అవకాశమున్నా అందుకు సమయం కేటాయించరు. అదే నా బాధ. అందరికేమో గాని కవులకు మాత్రం తప్పకుండా అధ్యయనం అవసరం. చాలా మంది అది లేకనే గందరగోళానికి గురై వారి రచనలతో పఠితులను అయోమయానికి గురిచేస్తుంటారు.

వనవాసం తర్వాత రాముడు తిరిగొస్తే అంతా ఘనస్వాగతం పలుకుతారు. ఆ సమయంలో లక్ష్మణుడు నవ్వుతూ అందరికీ కనిపిస్తాడు. ఎందుకు నవ్వావని అడిగితే…14 ఏళ్లుగా వనవాసంలో ఉన్నప్పుడు రాని నిద్ర ఈ సంతోష సమయంలో వస్తోందేంటని నవ్వుకున్నాను అంటూ లక్ష్మణుడు బదులిస్తాడు. ఇదీ సంగతి. ఇదంతా రామాయణంలో ఉంది. ఇది చదవని చాలా మంది నాకు ఫోన్ చేసి ఎందుకు నవ్వాడో చెప్పరా సార్ అంటూ అడుగుతుంటే ఒక్కోసారి నవ్వొచ్చేది. అంతలోనే బాధేసేది.

ఈ కల ఏంటి? పాలాభిషేకమేంటి? లక్ష్మణుడు పేరుతో తెగ విసిగిస్తున్నాడేంటని అనుకోకండి. ‘వద్దు ఏ ప్రచారమనే స్వాములకూ/ వార్తల్లో మెరవాలని ఉంటుంది’ అన్నాడు సినారె. నేనే కాదు ఇప్పుడు కవులందరిలోనూ నాలాగే ఉన్నట్లు కనిపిస్తోంది. నా గురించి ఎందుకులే అంటారు. నాలుగు మాటలు చెప్పి పొగడ్తలలో ముంచకపోతే వీడికి ముదిరింది. సీనియర్లను పట్టించుకోవడం లేదంటారు. అలాగని పొగడ్తలతో ముంచెత్తితే కాకా పడుతున్నాడంటారు. ఏంటో ఈ గోల! ఏదీ చేసినా రెండు రకాలుగా చూడడం అలవాటై పోయింది అందరికీ. దీనికి కారణం విషయ పరిజ్ఞానం లేకపోవడమే. ఇది సాధించాలంటే అధ్యయనం. ఆయుధం.

కవులకు అధ్యయనం అవసరం. అది లేకుండా చేసిన రచనలలో సారం అంతంతమాత్రమే. ‘సాధనంబు లేక సమకూడ దేదియు/ బోధలేని విద్య పొందదెపుడు’ అన్నాడు వేమన. అభ్యాసము లేకుండా సాధించలేము. బోధన లేకుండా విద్య పొందలేము. ఈ మధ్య పేపర్లో వచ్చిన కవిత చదివాను. శీర్షిక వేరు. కవిత సారాంశం వేరు. ప్రారంభానికి ముగింపుకు సంబంధంలేదు. చెప్పదలచుకున్నది ఒకటి, చివరకు చెప్పిందొకటి అనిపించింది. సోషల్ మీడియాలోగానీ, పత్రికల్లో గాని వస్తున్న కవితలు చాలా వరకు ఈ కోవలోనే ఉంటున్నాయి. మీరెంత అద్భుతంగా కవితలు రాస్తారో మాకు తెలియదా అనుకోకండి. నేను కవితలు ఎక్కువగా చదువుతుంటాను. రాసిన విధానాన్ని పరిశీలిస్తుంటాను. రాయడానికి భయపడుతుంటాను.

90వ దశకం తర్వాత దేశంలోకి నూతన ఆర్థిక విధానాలు వచ్చాక కొన్ని విప్లవాత్మకమైన మార్పులు సంభవించాయి. ఈ ఆర్ధిక విధానాలు ఎంత ప్రయోజనకరమో, అంత నాశనానికి నాంది పలికాయి. ప్రపంచ కుగ్రామం అయిపోయింది ఈ విధానాల వల్లనే. అదే సందర్భంలో ఒకింట్లోనే ఉంటూ రెండుగా జీవిస్తున్నదీ వీటి వల్లనే. అస్తిత్వ వాదాలు పెరిగాయి. మన పోయి నేను అనే పదం వచ్చి చేరింది. నా దేశం, నా రాష్ట్రం, నా జిల్లా, నా ఊరు, నా కుటుంబం నుండి నేను అనేదాకా వచ్చింది. మనదంతా ఒకే సంస్కృతి అని అంటుంటే అప్పుడప్పుడు అనుమానం కలిగేది. దేశంలో విభిన్న జాతులు, వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఉత్తర భారత దేశం సంస్కృతి వేరు. దక్షిణ భారతం వేరు. దక్షిణంలో తమిళనాడు వేరు, తెలుగు ప్రజలది వేరు. తెలుగులో గిరిజనులది వేరు, షెడ్యూల్డ్ కులాలది వేరు. ఇలా వేర్వేరుగా ఉన్న మనం, వేర్వేరుగా ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తున్న మనం పైకి వచ్చేసరికి గొప్ప సంస్కృతి అంటున్నాం. ఇది చెప్పుకోవడానికి బాగున్నా ఆచరణలో మాత్రం విరుద్ధంగా ఉంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కో సంస్కృతి ఉంది. అలాంటప్పుడు నా సంస్కృతి నీదెలా అవుతుందనేది చాలా మంది వాదన. అందుకే భిన్నత్వంలో ఏకత్వం మనదంటారు. మీరు ఏకీభవిస్తారా లేదా అనేది మీ నిర్ణయం. ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే… అధ్యయనం లేకుండా ఒక విషయం గురించి సమగ్రంగా చర్చించాలంటే కుదరని పని. ఒక వేళ చర్చిస్తే అసమగ్రంగా ఉంటుంది.

ఈ మధ్య ఓ సాహితీ సంస్థ వారు రైతుబంధు గురించి రచయితలతో చర్చావేదిక పెట్టారు. దానికి నేనూ హాజరయ్యాను. రైతుల కడగండ్లు తెలిసిన సీఎం, రైతుల పక్షాన నిలిచి వారి చెమటచుక్కలు తుడిచేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారు. దీనిని హర్షిస్తూ మనం కలాలను ఝలిపించాలని అన్నాడో సీనియర్ కవి. అనాదిగా రైతులు భూమిని నమ్ముకుని బతుకుతున్నారు. వారి జీవితాల్లో ఏనాడూ వెలుగులు లేవు. అందుకే చీకట్లను తరిమి వెలుగులు నింపేందుకు ఈ పథకాన్ని తీసుకొచ్చారంటూ మరో సీనియర్ కవి కవిత చదివాడు. ఇలా అందరూ హర్షం వ్యక్తం చేస్తూ చెప్పుకుంటూ పోతున్నారు. నా వంతు వచ్చేసింది. రైతుల చెమటచుక్కలు తుడిచేందుకు ఈ పథకం వచ్చిందన్నారు. ఏసి రూముల్లో కూర్చొని ఏడాదికేడాది కౌలు పొందుతున్నవారా, లేక ఇంకా భూమినే నమ్ముకుని రెక్కలు ముక్కలు చేసుకుని ఎర్రటెండలో సాలిరువాలు వేస్తున్న వారా. ఎవరు రైతులు. ఏ రైతుల కోసం ఈ పథకం వచ్చింది. ఒకింత ఆవేశంగానే అన్నాను. అదేంటయ్యా అలా అంటావు. ఆనాడు కష్టించి భూములు సంపాదించుకున్నారు. ఇప్పుడు కౌలుకు ఇచ్చి ఒకరికి ఉపాధి కల్పిస్తున్నారు. భూములున్నవారు తీసుకోవడంలో తప్పేంటి అంటూ ఎదురుగా కూర్చున్న పెద్దమనిషి ప్రశ్న వేశాడు. మంచి ప్రశ్న. భూములన్న వారు సాగు చేస్తూ పథకం ఫలాన్ని పొందాలి. ఇప్పుడు అలా జరగడంలేదు. కదా. ఒకరు సాగు చేస్తున్నారు. ప్రతిఫలం మరొకరు పొందుతున్నారు. దీనినే వ్యతిరేకిస్తున్నాను అంటూ ముగించాను. అర్థమైన వారు చప్పట్లు కొట్టారు. అర్థం కాని వారు, అర్థం లేదనుకున్నవారు గుర్రుగా చూశారు.

వ్యవసాయరంగంపై సమగ్రంగా అధ్యయనం చేసి అనేక మంది రచయితలు రచనలు గావించారు. వాటిని చదవకుండా, వాటి సారం వంటపట్టించుకోకుండా గంటల కొద్దీ ఉపన్యాసం ఇచ్చినా ప్రయోజనం శూన్యం. ‘ఏ నినాదం వెనుక ఏ ప్రయోజనం దాగి వుందో తెలుసుకోలేనంతకాలం ప్రజలు మోసపోతూనే ఉంటారు’ అన్నాడు లెనిన్ మహాశయుడు. ఆ ప్రజలను చైతన్యం చేసే బాధ్యత కవులది, రచయితలది. అందుకే సమగ్ర అధ్యయనం, సమగ్ర పరిశీలన, సమగ్ర వ్యక్తిత్వం అవసరం. ‘మిడిసిపడే చీకట్లకు సన్నని మెరుపే గుణపాఠం” అని సినారె అన్నారు. విషయ పరిజ్ఞానానికి అధ్యయనమే సాధనం అని నేనంటున్నాను. మరి మీరెమంటారు..? ఏదో ఒకటి చెబుతారని ఆశిస్తూ వచ్చే వారం మరికొన్ని సంగతులు చెప్పుకుందాం.

– నామా పురుషోత్తం
98666 45218.

'జనవిజయం' జనరల్ ఆర్టికల్స్, విశ్లేషణలు పొందడానికి, సమస్యలను 'జనవిజయం' దృష్టికి తీసుకురావడానికై జనవిజయం సోషల్ మీడియా ప్రొఫైల్స్ లలో జాయిన్ అవ్వండి:
జనవిజయం Join Link
జనవిజయం Join Link
జనవిజయం
జనవిజయం
 
ఇవీ చూడండి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారంలో ఎక్కువగా వీక్షించినవి:

- Advertisment -

ఎక్కువగా వీక్షించిన పోస్టులు (ఆల్-టైం):

వ్యాఖ్యలు

కట్టెకోల చిన నరసయ్య on పరిశీలన,సాధన.. రచనకు ప్రయోజనకరం

విభాగాలు

తెలంగాణజాతీయంరాజకీయంపరిపాలనఆరోగ్యంఆంధ్రప్రదేశ్ప్రత్యేకంసినిమాసాహిత్యంవాణిజ్యంస్పూర్తిఅంతర్జాతీయంప్రముఖులువ్యవసాయంవీడియోలుఆయుర్వేదంఅధ్యయనంపోల్స్వినదగునెవ్వరు చెప్పినమంతెన ఆరోగ్య సలహాలువిద్యఎడిటర్ వాయిస్జర్నలిజంవికాసంవార్త-వ్యాఖ్యతెలుసుకుందాంపర్యావరణంపిల్లల పెంపకంవీరమాచనేని డైట్ సలహాలునేర వార్తలుఎన్నికలువిజ్ఞానంసమాజంన్యాయంఆధ్యాత్మికంజీవనంఆర్ధికంఉపాధిప్రకృతిరాజ్యాంగంవాతావరణంవార్తలువినోదంసాంకేతికతకుటుంబంక్రీడలుచరిత్రనాడు-నేడుపర్యాటకంప్రకృతి వ్యవసాయంటెక్నాలజీప్రజఎడిట్ఈపేపర్టీవీపల్లెప్రపంచంపీపుల్స్ ఇంటర్వ్యూబ్లాగ్మంచిమాటమన భూమిమహా విశ్వంమా బృందంవిజయపథంవివిధసంప్రదించండి