భద్రాద్రి కొత్తగూడెం, జూలై 31 (జనవిజయం): నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ అమరవీరుల వారోత్సవాల పేరుతో తెలంగాణ-ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు గ్రామాలలో నివసించే ఆదివాసి ప్రజలను పీడిస్తోంది అని ఓఎస్డీ సాయి మనోహర్ ఒక ప్రకటన లో ఆరోపించారు. సభలు పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ సరిహద్దు చతిస్గడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల పేరుతో మీటింగులు నిర్వహిస్తూ,అట్టి మీటింగులకు హాజరుకావాల్సిందిగా తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ఆదివాసి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతూ ఆదేశాలు జారీ చేస్తున్నారని తెలిపారు.మీటింగునకు హాజరుకాని ఇంటికి మూడు వేల రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని చెబుతూ,మీటింగ్ కు రాకపోతే ప్రజా కోర్టు నిర్వహించి హతమారుస్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.అదే విధంగా మీటింగ్ కి వచ్చే ఆదివాసీలను ఒక్కో ఇంటికి 200/- రూపాయలను మావోయిస్టు పార్టీ ఫండ్ గా తీసుకొని హాజరుకావాలని బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలోని,చత్తీస్గడ్ సరిహద్దు గ్రామాలలో మావోయిస్టు పార్టీ తన ఉనికిని,ఆదరణను కోల్పోయి చివరికి ఆదివాసీలను బెదిరిస్తూ మావోయిస్టు పార్టీ కార్యక్రమాలకు హాజరయ్యే విధంగా ఆదివాసీ వ్యతిరేక విధానాలను కొనసాగిస్తుందని తెలిపారు.ఒక వైపు భారీ వర్షాలతో సంభవించిన వరదల వలన ఆదివాసి ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండగా మీటింగుల పేరుతో పార్టీ ఫండ్ పేరుతో బలవంతపు వసూళ్లకు పాల్పడుతూ ఆదివాసీలను మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.మావోయిస్టు పార్టీ నిర్వహిస్తున్న మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా మావోయిస్టు పార్టీ ఆదివాసీల పట్ల ఎటువంటి దాడులకు పాల్పడకుండా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.వరదల సమయాల్లోనే కాకుండా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ కార్యకలాపాలను ప్రజలు ప్రతిఘటించడంలో పోలీసులు ఎల్లవేళలా అండగా ఉంటారన్నారు.తెలంగాణ-ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతంలో ప్రజలు ఎవరు కూడా భయభ్రాంతులకు బెదిరింపులకు గురై మావోయిస్టు పార్టీ నిర్వహిస్తున్న బలవంతపు మీటింగ్లకు వెళ్లరాదని,పోలీసులు మీకు ఎల్లప్పుడూ మీ రక్షణ నిమిత్తం అందుబాటులో ఉంటారని తెలియజేసారు.