భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 12 (జనవిజయం): వలస ఆదివాసి ప్రజలకు కనీస సౌకర్యాలను అందించడమే పోలీస్ లక్ష్యం అని ఎస్పీ డా.వినీత్.జి పేర్కొన్నారు. ఆయన శనివారం చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో పర్యటించారు. ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాటు అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి.సాయి మనోహర్, భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ కూడా పాల్గొన్నారు.
ముందుగా చర్ల మండలంలోని బూరుగుపాడు గుత్తి కోయ గ్రామంలో చర్ల పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ ప్రారంభించారు.50 కుటుంబాలకు చెందిన గ్రామస్తులు,చిన్నపిల్లలు,వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.భద్రాచలం మరియు చర్ల నుండి ప్రత్యేక వైద్య బృందం చేత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది.గ్రామంలోని యువతకు వాలీబాల్ కిట్లను అందజేశారు. అనంతరం చర్ల నుండి పూసుగుప్ప రహదారి మధ్యలో వరదలు సంభవించినప్పుడు రోడ్లు కొట్టుకుపోయి ప్రజల రాకపోకలకు అంతరాయం కలిగేది. ఈ రహదారిలో కేంద్ర ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన 04 బ్రిడ్జిలను ఈ రోజు ఎస్పీ ప్రారంభించారు.ఇక నుండి పూసుగుప్ప ప్రజలు చర్ల చేరుకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలుగవని అన్నారు.
ఉంజుపల్లి సిఆర్పిఎఫ్ క్యాంపు నందు ప్రొటెక్షన్ వాల్ నిర్మించుట కొరకు ఏర్పాటు చేసిన శంకుస్థాపన చేశారు. అనంతరం ఉంజుపల్లి గ్రామస్తులకు 3,20,000/- ల రూపాయల వ్యయంతో కొనుగోలు చేసిన ఒక గానుగనూనె మిల్లును అందజేశారు. చర్ల లెనిన్ కాలనీలో మండలంలోని యువతకు స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించుటకు అధికారులతో కలిసి ల్యాండ్ సర్వే నిర్వహించారు.దుమ్ముగూడెం మండలంలో నూతనంగా నిర్మితమవుతున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనులను పరిశీలించి అక్కడ అధికారులకు పలు సూచనలను చేశారు.
ఈ కార్యక్రమాలను ఉద్దేశించి ఎస్పీ గారు మాట్లాడుతూ జిల్లాలోని వలస అదీవాసీల సంక్షేమం కోసం జిల్లా పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు.వారికి కనీస సౌకర్యాలను అందించడమే జిల్లా పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమాలలో చర్ల సిఐ రాజగోపాల్,దుమ్ముగూడెం సిఐ రమేష్,సిఐలు అశోక్,రాజు వర్మ,ఎస్సైలు టి.వీ.ఆర్ సూరి,నర్సిరెడ్డి,కేశవ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.