అధైర్య పడకండి.. మేమున్నాంటున్న మంత్రి పువ్వాడ!
- భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నా… ప్రాణ నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న మంత్రి పువ్వాడ
- అత్యవసరం అయితే తప్పా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ప్రజలకు విజ్ఞప్తి
- మున్నేరు వరద ఉదృతిని పర్యవేక్షించి, ముంపుకు గురైన బాధితులను కలిసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, జులై 27 (జనవిజయం) :
కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పరిస్థితులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్వయంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తున్నారు. ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, మంచికంటి నగర్ ప్రాంతాల్లో నివాసంలోకి వరద నీరు చేరడంతో లోతట్టు ప్రాంతాల నిర్వాసితులకు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు.
ఈ మేరకు వరదలో తిరుగుతూ ఇంకా పునరావాస కేంద్రాలకు వెళ్లని వాళ్ళను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని మంత్రి సూచించారు. వరద నీటిలో ఇంటింటికీ వెళ్లి బాధితులను కలిసి ధైర్యం చెప్పారు. ఇళ్లలో ఉండొద్దు అని, వరద పెరిగే ప్రమాదాలు లేకపోలేదని అధికారులకు సహకరించాలని సూచించారు.
గతంలో ఎన్నడూ ఇంతటి వర్షాలు చూడలేదని స్థానిక ప్రజలు మంత్రి పువ్వాడతో మాట్లాడారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలు ఒక పక్క, వివిధ ప్రాజెక్ట్స్ గేట్స్ ఎట్టివేయడం మారో పక్క.. తద్వారా గోదావరికి వరద పోటెత్తిందని మంత్రి పువ్వాడ వారికి చెప్పారు. ఎవ్వరూ అధైర్యపడొద్దని ప్రభుత్వం అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకుంటుందని, నయా బజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలకు వెళ్ళాలని సూచించారు.
రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రిసిటీ, పంచాయితీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, హెల్త్ పలు ప్రభుత్వ శాఖలు అధికారులను, క్షేత్ర స్థాయి సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలుతో మాట్లాడుతూ మేమున్నాం అంటూ వారిలో ధైర్యం నింపారు. అత్యవసరం అయితే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని మంత్రి పువ్వాడ విజ్ఞప్తి చేశారు. అకారణంగా ప్రజలను ఎవరిని బయటకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను, ఇరిగేషన్ అధికారులందరు ముంపు ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని అధికారులని ఆదేశించారు.
మంత్రి పువ్వాడ వెంట కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, తహశీల్దార్ శైలజ అధికారులు ఉన్నారు.