భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 24 (జనవిజయం): భద్రాద్రి జిల్లాలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం విస్తృతంగా పర్యటించారు.కొత్తగూడెం, రామవరం, పాల్వంచ లో పలు అభివృద్ది పనులకు ఎమ్మేల్యే వనమా వెంకటేశ్వరరావుతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
కొత్తగూడెం మున్సిపాలిటీలో రూ.75.25 కోట్లు, పాల్వంచ మున్సిపాలిటీలో రూ.60కోట్లు మొత్తం 135.25 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. కొత్తగూడెం లోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు కొత్తగూడెం పురపాలక సంఘం పరిధిలో DMF నిధులతో చేపట్టాల్సిన వివిధ అభివృద్ది పనుల పైలాన్ ను ఆవిష్కరించారు. పాల్వంచ లో నవభారత్ వద్ద రూ.60 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనుల పైలాన్ ను మంత్రి పువ్వాడ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో పువ్వాడ మాట్లాడుతూ గడిచిన 75 సంవత్సరాలలో రూ.75 కోట్లతో అభివృద్ది పనుల కోసం కేటాయించిన సందర్భాలు లేవని అన్నారు.
వార్డుల అభివృద్ది కోసం కోట్ల రూపాయలు ఏ ప్రభుత్వంలో అయిన వచ్చాయా..? ఎవరైనా ఇచ్చారా.. అది కేవలం తెలంగాణ ప్రభుత్వంతోనే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు.ప్రజలకు అన్ని సౌకర్యాలు, సెంట్రల్ లైటింగ్ లు, సెంట్రల్ డివైడర్ లు, రోడ్లు, కాల్వలు, పార్కులు ఇలా అనేక పనులకు నిధులు BRS ప్రభుత్వంతోనే సాధ్యం అని మంత్రి చెప్పారు.రాబోయే రోజుల్లో కొత్తగూడెం, పాల్వంచ జంట పట్టణాలుగా కలిసిపోయేలా అభివృద్ది త్వరలోనే జరుగుతుందని అన్నారు.కొత్తగూడెం అభివృద్ది జరగాలంటే ఇక్కడ వనమా ను గెలిపించాలని మంత్రి కోరారు.