Thursday, October 5, 2023
Homeవార్తలుభద్రాచలం కు మరణశాసనం రాసింది బిజెపి నే

భద్రాచలం కు మరణశాసనం రాసింది బిజెపి నే

  • కేసీఆర్ ప్రకటించిన 1000 కోట్లు మంజూరు చేయాలి
  • సీపీఎం నేత పోతినేని సుదర్శన్

భద్రాచలం, జూలై 31 ( జనవిజయం):
పోలవరం ప్రాజెక్టు పేరుతో ముంపు మండలాలను ఆంధ్రలో కలిపి భద్రాచలం ప్రాంతానికి మరణ శాసనం రాసింది బిజెపి ప్రభుత్వమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు ఆరోపించారు. నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక విలీన మండలాలను ఆంధ్రాలో కలుపుతూ ఆర్డినెన్స్ పై మొదటి సంతకం చేశారనీ ఆయన గుర్తు చేసేరు. సోమవారం ఆయన స్థానిక సీపీఎం నాయకులతో కలిసి భద్రాచలం పట్టణం లోని ముంపు ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను సందర్శించారు.

అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్లనే భద్రాచలం కు ఈ దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ ప్రమాదాన్ని సిపిఎం 2007లోనే పాలకుల దృష్టికి తీసుకువచ్చి అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిందని అన్నారు. ఆ సందర్భంగా సిపిఎం కార్యకర్తలపై కాల్పులు జరిపి జైలకు పంపి 17 సంవత్సరాలుగా కోర్టుల చుట్టూ తిప్పించిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నేడు సిడబ్ల్యూసి సైతం పోలవరం బ్యాక్ వాటర్ తోటి భద్రాచలం కు ప్రమాదం పొంచి ఉన్నదని ప్రకటించిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలవరం ముంపు అంచనాను నిర్దిష్టంగా వేయాలని కోరారు. ఐదు పంచాయతీలను తెలంగాణ భద్రాచలంలో కలపడం ద్వారానే భద్రాచలం కు భవిష్యత్తు ఉందని, అందుకు కేంద్ర ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చించేందుకు చొరవ చూపాలని, ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావాలని అన్నారు. నిత్యం రాముని జపం చేసే బిజెపి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రాచలం రాముని గురించి ఎందుకు మాట్లాడటం లేదు అని ప్రశ్నించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ముఖ్యమంత్రితో మాట్లాడి కరకట్ట పొడిగించేందుకు ఉన్న ఆటంకాలను తొలగించి వెంటనే కరకట్ట సమస్య పరిష్కరించాలని కోరారు. భద్రాచలం పట్టణం వరద ముంపుకు గురి కాకుండా శాశ్వత ప్రాతిపదికన స్లూయిజులు రిపేరు చేయించి మోటార్లు ఏర్పాటు చేయాలని, తగిన సిబ్బందిని నియమించాలని,ప్రత్యేక యంత్రాలు ఉపయోగించాలని అన్నారు. వరద వచ్చినప్పుడే కాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకోవాలని తగిన నిధులు విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. వరద ముంపుకు గురై పునరావాస కేంద్రాలకు తరలించిన ప్రతి కుటుంబానికి 25వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

భద్రాచలం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం విడాలని లేకుంటే సిపిఎం ప్రజా పోరాటాలకు శ్రీకారం చుడుతుందని హెచ్చరించారు.ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించి అన్ని జాగ్రత్తలు తీసుకున్న జిల్లా కలెక్టర్ మరియు యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు.
సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలు కారణంగా రోడ్లు చెరువులు ధ్వంసమయ్యాయని వాటిని వెంటనే పునరుద్ధరించాలని జిల్లాలో రైతాంగం వేసుకున్న పంటలు పూర్తిగా నీట మునిగి పంట నష్టం ఏర్పడిందని నష్టపోయిన రైతాంగమును ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులు గత నెల రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వెంటనే గ్రామపంచాయతీ కార్మికుల సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.వరదలు వర్షాలు నేపథ్యంలో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున వైద్య బృందాలను గ్రామాలకు అందుబాటులో ఉంచాలని కోరారు.

ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య, కె. బ్రహ్మచారి, ఎం.బి. నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా కమిటీ సభ్యులు ఎ.సత్యనారాయణ, ఎం. రేణుక, సున్నం గంగ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు బి వెంకటరెడ్డి, వై వెంకట రామారావు, ఎన్ లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు బి. కుసుమ, తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments