- అడ్డగోలుగా అధిక ధరలకు మద్యం అమ్మకాలు
- రహదారిపై తూలుతున్న మద్యం ప్రియులు
- అడ్డ దిడ్డంగా బైక్ ల పార్కింగ్, సిట్టింగ్, బెట్టింగ్
- పట్టని ఎక్సైజ్ అధికారులు
- బెల్ట్ షాపుకు మా నుండి ఎలాంటి అనుమతులు లేవు – ఎక్సైజ్ ఎస్ ఐ వెంకటేష్
వేంసూరు, ఆగస్ట్ 11 (జనవిజయం): సత్తుపల్లి నియోజకవర్గ కేంద్రం నుండి వేంసూరు మండల పరిధిలోని వెన్నచేడు వెంకటాపురం గ్రామం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ మహానగరాని కు పోవడానికి రాష్టీయ రహదారిపై వెన్నచేడు వెంకటాపురం గ్రామ శివారులో విజయవాడ పోవుటకు, మండల పరిధిలోని అమ్మపాలెం మీదుగా తిరువూరు పట్టణం పోవుటకు రహదారులు విడిపోయే అత్యంత ప్రమాదకరమైన మూల మలుపు అత్యంత ప్రమాదకరంగా మారింది. ఆ మలుపు వద్ద ఎటువంటి ప్రమాద హెచ్చరిక బోర్డులు కానీ, రహదారిపై జీబ్రా క్రాసింగ్ చారలు కానీ లేవు. దీంతో ప్రమాదాలకు నిలయంగా మారుతోంది. అక్కడకు రాగానే టెన్షన్ టెన్షన్. ప్రయాణికులు గుప్పిట్లో ప్రాణాలు పెట్టుకొని ముందుకు వెళ్లాల్సిందే. గతంలో విజయవాడ నుండి సత్తుపల్లి వెళ్ళ వలసిన ఆర్టీసి బస్సు రాత్రి సమయంలో అమ్మపాలెం వైపు వెళ్లిన పరిస్థితి ఉంది. ఆర్.బి.శాఖ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. ఇది ఇలా ఉంటే అదే మలుపు వద్ద అనుమతులు లేని బెల్ట్ మద్యం దుకాణం సిట్టింగ్ తో ఏర్పాటు చేశారు. ఎమ్.ఆర్.పి.ధరల కంటే అధిక ధరలకు అమ్ముతూ మద్యం ప్రియుల జేబులకు చిల్లులు వేస్తున్నారని ఆరోపణలు విన వస్తున్నాయి. మద్యం సేవించిన అనంతరం మందుబాబులు రహదారిపై తూలుతు వాహనాలకు అడ్డుగా వెళ్తున్న దుస్థితి దాపురించింది. మూల మలుపు వద్ద ఉన్న ఆ బెల్ట్ షాప్ వద్ద ప్రధాన రహదారికి ఆనుకొని అడ్డ దిడ్డంగా బైక్ లు నిలుపుతున్న పరిస్థితి ఉంది. అంతే కాకుండా వివిధ రకాల ఆన్లైన్ జూద ఆటలకు సంబంధించి బెట్టింగ్ లు కూడా జరుగుతున్నాయని వినికిడి. కుటుంబంతో కలిసి బైక్ పై ప్రయాణం చేయాలంటే మందుబాబుల గూర్చి భయపడుతున్నారని పలువురు అంటున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ శాఖాధికారులు కన్పించిన జాడ లేదని అసలు ఎక్సైజ్ శాఖా ఉందా లేదా అని పలువురి ఆవేదన.ఇట్టి విషయమై సంబంధిత ఎక్సైజ్ శాఖ ఎస్ఐ వెంకటేష్ ను సంప్రదించగా బెల్ట్ షాపు లకు మా శాఖ నుండి ఎట్టి అనుమతులు ఇవ్వలేదని తెలిపారు.