ఎన్నో ఏళ్ల భూ సమస్యకు ధరణి పోర్టల్ ద్వారా శాశ్వత పరిష్కారం
అర్హులైన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 21(జనవిజయం): ధరణి పోర్టల్ ద్వారా ఎన్నో ఏళ్ల సమస్యకు పరిష్కారం చూపినట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. శుక్రవారం కరకగూడెం మండలం, రేగళ్ల గ్రామంలో ఏళ్ల తరబడి. అసైన్మెంట్ భూముల్లో సేద్యం చేస్తున్న గిరిజనులకు పట్టాలు పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ తో కలిసి పాల్గొన్నారు.
అర్హులైన గిరిజనులకు పట్టాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చినట్లు ఆయన తెలిపారు. అర్హులైన 108 మందికి 360.27 ఎకరాల భూమికి ధరణి పోర్టల్ ద్వారా సమస్య పరిష్కారమయినట్లు
ఆయన చెప్పారు. తరతరాలుగా వ్యవసాయాన్ని జీవనాధారం చేసుకుని జీవిస్తున్న నిరుపేద గిరిజనుల సమస్యకు ధరణి పోర్టల్ ద్వారా శాశ్వత పరిష్కారం లభించిందని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరుతో సేద్యానికి సంవత్సరానికి ఎకరాకు 5 వేలు రైతుబంధు నిధులతో పాటు రైతు భీమా కూడా వర్తిస్తుందని చెప్పారు. ధరణి పోర్టల్ ద్వారా పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరుకు కృషి చేసిన జిల్లా కలెక్టర్ అనుదీప్ ను ఆయన అభినందించారు.
ఎన్నో ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతులకు నేటితో సర్వ హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినట్లు చెప్పారు. సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కి ధన్యవాదాలు తెలిపారు.
జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ధరణి పోర్టల్ ద్వారా అర్హుల నుండి దరఖాస్తులు స్వీకరించి పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేసినట్లు చెప్పారు. పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరుతో రైతులకు ప్రభుత్వం అందించే రైతుబందు నిధులతో పాటు రైతుభీమా కూడా వర్తిస్తుందని చెప్పారు. పట్టాదారు పాసు పుస్తకాలు జారీకి కృషి చేసిన తహశీల్దార్ ఉషా శారదను, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు.