48 గంటలు జాగ్రత్తగా ఉండాలి, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని మంత్రి పువ్వాడ పిలుపు
- అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనండి
ఖమ్మం జులై 27(జనవిజయం):
నిర్విరామంగా కురుస్తున్న వర్షాల ధాటికి మున్నేరు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో అధికారులు, సిబ్బంది తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు.
వాతావరణ శాఖ జిల్లాకు రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో రాబోయే 48 గంటలు జిల్లాలో భారీ నుండి అతిభారీ వర్షాలు పడే సూచనలు ఉన్నందున జాగ్రత్తగా వుండి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ను మంత్రి ఆదేశించారు.
ఖమ్మం కాల్వొడ్డు వద్ద మున్నేరు ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ vp గౌతమ్ తో కలిసి మంత్రి పువ్వాడ పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..
వాతావరణ శాఖ సూచన ప్రకారం జిల్లాలో 40 సెంటిమీటర్లకు పైగా వర్ష సూచన ఉన్నాయని అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సమస్యాత్మక ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ చేస్తూ, పరిస్థితులను ఎదుర్కొనేలా చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్, రెవెన్యూ, పిఆర్, ఆర్ అండ్ బి, ఇర్రిగేషన్ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షించాలన్నారు.
లోతట్టు ప్రాంతాలైన వెంకటేశ్వర నగర్, మోతినగర్, బొక్కలగడ్డ, జలగం నగర్, FCI, దానవాయిగూడెం ప్రజలను పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుందని, ప్రభావిత ప్రాంతాల ప్రజల కోసం నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఎర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు వెళ్లాలని సూచించారు..
జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్న కల్వర్టుల వద్ద ప్రవాహం అధికమైన చోట ప్రజలు నేరుగా రాకపోకలు జరపకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ ను విష్ణు ఎస్.వారియర్ ను ఆదేశించారు.
ప్రమాదానికి ఆస్కారం వుండి, అవసరమున్నచోట రహదారిని మూసివేయాలని, రాకపోకలు జరపకుండా భద్రత ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదమున్న చెరువుల వద్ద ఇసుక బస్తాలు సిద్దం చేసుకోవాలన్నారు.
వర్షంలో చేపలు పట్టుటకు వెళ్లకుండా చూడాలన్నారు. లోతట్టు ముంపు ప్రదేశాల్లో వర్షపు నీరు ఇండ్లలోకి రాకుండా తగుచర్యలు చేపట్టాలన్నారు. అధికారులు ప్రధాన కార్యస్తానంలోనే ఉంటూ, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షణ చేయాలని, ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ముంపుకు గురయ్యే ప్రాంతాలు, పీఆర్, ఆర్ అండ్ బి రోడ్లపై, కల్వర్టులపై నీరు ప్రవహించే ప్రాంతాల్లో రవాణా నిషేధించి, రాత్రి పగలు సిబ్బందితో నిఘా పెట్టాలన్నారు. రోడ్లపై రవాణా నిషేధించిన ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ రోడ్లను సూచిస్తూ, 2 కి.మీ. ముందుగానే సూచికలు ప్రదర్శించాలని, ప్రవాహంకి ఇరువైపుల ట్రాక్టర్లు అడ్డంగా పెట్టి, సిబ్బందిని కాపలా పెట్టాలని ఆయన తెలిపారు.