- భద్రాద్రిలో సరిహద్దు జిల్లాల అధికారుల సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్ట్ 22 (జనవిజయం): అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం లో మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని అధికారిక సమావేశం లో నిర్ణయించారు. మంగళవారం ఐటీసీ గెస్ట్ హౌస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గడ్ రాష్ట్రాల సరిహద్దు జిల్లాల అధికారులతో ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. మూడు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ఈ సమావేశం లో భద్రతా పరమైన పలు కీలకాంశాలను చర్చించారు.
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా, ఎన్నికల సమయంలో మద్యం, నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశం, నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టాలని నిర్మించారు. గంజాయి ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంక, సుకుమా జిల్లా కలెక్టర్ హరీష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్, ములుగు జిల్లా ఎస్పీ గౌస్ అలం, జయశంకర్ భూపాలపల్లి ఎస్పీ పి.కరుణాకర్, భద్రాచలం ఐటిడిఎ పీఓ ప్రతీక్ జైన్ తదితరులు పాల్గొన్నారు.