భారీ వర్షాల కారణంగా 3 రోజులు అప్రమత్తంగా ఉండాలి
- ప్రజలకు , అధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు
ఖమ్మం జులై 25 (జనవిజయం):
మూడు రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ సూచన మేరకు ప్రజలు, ఉమ్మడి ఖమ్మం జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
ఈ మూడు రోజుల పాటు వాతావరణ శాఖ మోడల్ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు. గ్రామ, మండల అలాగే జిల్లా స్థాయి అధికారులు కార్యస్థానాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ప్రజలు పొంగి పొర్లుతున్న వాగులు దాటొద్దని చెప్పారు. పొంగే వాగులపై రవాణా సేవలు నిలిపివేయాలని చెప్పారు. నిండు కుండల ఉన్న జలాశయాలను వీక్షించడానికి అవకాశం లేకుండా నియంత్రణ చేయాలన్నారు. రహదారుల పైకి నీరు చేరిన ప్రాంతాల్లో ప్రమాద హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు.
రహదారులపై పడిన చెట్లు తక్షణమే తొలగించాలని ప్రజా రవాణాను పునరుద్దరించాలని చెప్పారు. ఎడతెరిపి లేకుండా వర్షాల వల్ల శిథిలావస్థలో ఉన్న ఇళ్ళు కూలిపోయే ప్రమాదం ఉందని అలాంటి వారిని గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు.
అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950 కంట్రోల్ రూముకు కానీ, వాట్సప్ నంబర్ 9392919743కు మెసేజ్ కానీ వీడియో కానీ చేయాలని చెప్పారు. కొత్తగూడెం ఆర్డిఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డిఓ కార్యాలయంలో 08743-232444, వాట్స్ ప్ నంబర్ 7981219425 లకు మెసేజి లేదా వీడియో పంపాలని చెప్పారు.
24 గంటలు పని చేయు విధంగా ఏర్పాటు చేసిన కంట్రోల్ రూములకు ఫోన్ చేయాలని ప్రజలకు సూచించారు. వర్షాలకు పశువులు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్నదని, మేతకు బయటకు వదలకుండా ఇంటి వద్దనే ఉంచి రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని చెప్పారు. జలాశయాలు వద్ద గజ ఈత గాళ్లను, నాటు పడవలు, లైఫ్ జాకెట్లు, లైఫ్ బాయిస్ లను అందుబాటులో ఉంచాలని చెప్పారు. అత్యవసర సేవలకు NDRF సేవలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి పువ్వాడ పేర్కొన్నారు.