2020  భారతదేశపు జనవిజయ కేతనం

0
29
Share this:

క్యాలెండర్ లో తేదీమారడం అంటే భూమి సూర్యుడిచుట్టూ ఒక ప్రదక్షిణ పూర్తి చేయడం అది 365 రోజులు అనుకుంటాం కానీ అది అచ్చంగా చెప్పాలంటే 365.2422 రోజులు అంటే మూడు వందల అరవై అయిదుంపావు రోజులు పడుతుందన్నమాట భూమి సూర్యుడికి ఒకచుట్టు తిరిగి రావడానికి. మరి ఆ అదనపు పావురోజు ఎప్పుడు లెక్కేస్తారు అంటారా? అదేకదండీ నాలుగు పావులు కలిసి నాలుగేళ్ళ తర్వాత ఒక లీపు సంవత్సరంగా మరేది. అప్పుడు ఒక్కసారే 366 లెక్కవేస్తే ఇక పావులు అరలూ ముప్పావలా లెక్కలుండవన్నమాట,.  అదే భూమి తన చుట్టూ తాను తిరిగితే దాన్ని ఒకరోజు అనుకుంటున్నాం కదా. దానికి ఇరవై నాలుగు గంటలు అని లెక్కేస్తాం కానీ ఖచ్చితంగా చెపితే దానికి మూడున్నర నిమిషాలదాకా తక్కువ వస్తుంది. అంటే ఒక రోజుకు 23 గంటల 56 నిమిషాల 4.10 సెకన్లు అని ఖచ్చితంగా చెప్పాలేమో. అదే చంద్రగమనం లెక్కేస్తే మనకి కృష్ణ శుక్ల పక్షాలు దీనితో పాటు నక్షత్రాల తోవల్లోకి సూర్యుడు వచ్చే దారిని చూస్తూ నెలలను లెక్కపెట్టుకుంటున్నాం. భౌగోళికంగా తీసుకుంటే ఒకసాధారణ ప్రక్రియ పూర్తికావడంతో మన గోడకు తగిలించిన క్యాలెండర్ తీసే రోజు మరొకొత్త క్యాలెండర్ తగిలించే రోజు రావడమే కొత్త సంవత్సరం కదా. కానీ దాన్నే మానసికలోకపు ప్రత్యేకతలతో చూస్తే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపుకునే ప్రత్యేక క్షణాల గడపు దాటుకుంటూ మరోకాలంలోకి అడుగు పెట్టడం. There is no wrong time to do the right work అనేది నిజమే కావచ్చు కానీ మంచి పనికి కూడా ఒక ప్రేరణ ఉత్సాహం రావడానికి ఇలాంటి తాయిలాలు తప్పేం కాదేమో.

పాపం అబ్దుల్ కలాం గారు 2020 మీద ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. ప్రపంచ దేశాలతో పోల్చినప్పుడు అత్యధిక యువతను కలిగివున్న దేశంగా భారతదేశం వుండబోతోంది. అంటే ప్రపంచరాజ్యాలలో అభివృద్ది చెందుతున్న దేశంగానే మిగలకుండా అభివృది చెందిన దేశాలలో తనే ఒక లీడర్ గా వుండబోతోంది అంటూ లీడ్ ఇండియా 2020 అనే దేశవ్యాప్త ఉద్యమాన్ని అప్ బడో దేశ్ కో భడావో అనే నినాదంతో నిర్మించారు. దాని ప్రారంభంలోనే కార్యకర్తగా జాయిన్ అయ్యి శిక్షణ తీసుకున్న నాకైతే ఎప్పుడెప్పుడు 2020ని చూడాలా అని ఆతృతగా వుండేది. అదేదో రానే వచ్చింది చూడాలిప్పుడు కలాం కలలు కన్నా సూపర్ పవర్ దశలోకి దేశం వెళుతుందా లేదా అన్నది.

గాంధీ గ్రామస్వరాజ్యంతోనే దేశాభివృద్ది సాధ్యమని భావించినట్లే మన జన విజయం  సుస్థిరత మనదగ్గరనుంచే రావాలని కోరుకుంటోంది. లాభాపేక్షతో రేటింగ్ లుండే తళుకు బెళుకు వార్తాంశాలు కాక ప్రతి అక్షరం మొదడకు పదును పెట్టేదో, మనసును తేలిక చేసేదో కావాలని కోరుకుంటూ జనవిజయం అంతర్జాలంలో సైతం అక్షరమై, దృశ్యమై అందుబాటులోకి వచ్చింది.

ఎన్నోన్నో హార్దిక విజయాలను అందుకుంటూ అప్రతిహతంగా ముందుకు సాగాలని మిత్రుడిగా కోరుకుంటూ, జనవిజయం పాఠకులకూ శ్రేయోభిలాషులకూ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు. వెబ్ సైట్ ప్రారంభోత్సవ శుభకామనలు.

ధన్యవాదాలతో

మీ
కట్టా శ్రీనివాస్, కవి, చరిత్రకారుడు, ఖమ్మం

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.