ఖమ్మం, ఆగస్టు 22 (జనవిజయం): తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10సంవత్సరాల కాలంలో మొట్ట మొదటిసారిగా ఎక్కువ మొత్తంలో 5204 స్టాఫ్ నర్స్ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి ఆగస్టు 2న పరీక్ష నిర్వహించారని, ఆ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని స్టాఫ్ నర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఇస్లావత్ మురళి అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ ల నియామకం కొరకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా 1827 స్టాప్ నర్సుల నియామకం కొరకు మరొక నోటిఫికేషన్ ఇచ్చారని దానికి మరో పరీక్ష నిర్వహించకుండా ఆగస్టు 2న పరీక్ష రాసిన వారిలోనే ఈ పోస్టులను కూడా కలపాలని ప్రభుత్వాన్ని కోరారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ స్టాఫ్ నర్స్ లకు 20 మార్కులు కలపటం సమంజసం కాదని, సీనియారిటీ, వ్రాత పరీక్షలో మార్కుల ఆధారంగానే పోస్టులను నింపాలని డిమాండ్ చేశారు. కరోనా టైంలో ప్రభుత్వం అవకాశం కోసం స్టాఫ్ నర్స్ లను నియమించుకొని తర్వాత తొలగించటం దుర్మార్గమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలలో అనేక సంవత్సరాలుగా తక్కువ వేతనానికే పనిచేస్తున్నామని, తమకు కుటుంబం, పిల్లలు ఉన్నారని ప్రభుత్వం మా సమస్యను అర్థం చేసుకొని న్యాయం చేయాలని కోరారు.
ఈ విలేకరుల సమావేశంలో బి. కళ్యాణి, జి. వీరకుమారి, బి. మణి తదితరులు పాల్గొన్నారు.