సంఘటిత సవ్యసాచి ‘గాంధీ’

0
140
Share this:

చరఖా యంత్రంతో ఆధునిక ఆయుధ సంపత్తితో కూడిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలించిన ఒక అపూర్వ వ్యక్తి గురించి రాయటమంటే శరీరం ఆత్మ పులకాంకితం కావటమే ..

ఎవరూ ఊహించలేని , ఊహించజాలని శాంతి అనే పదాన్ని ఆలంబనగా చేసుకుని విశ్వం మర్చిపోలేని అసాధారణ అహింసా యుద్ధాన్ని నడిపిన అనంత శక్తి సంపన్నుడు గాంధీ.

1857 సిపాయిల తిరుగుబాటుతో మొదలైన స్వాతంత్రోద్యమ పోరాటాన్ని జాతి ఊపిరిగా మార్చి వందేమాతరం, క్విట్ ఇండియా, ఉప్పు సత్యాగ్రహం, సైమన్ గో బ్యాక్ వంటి జాతీయోద్యమాలను ఒంటి చేత్తో నడిపిన సవ్య సాచి గాంధీ.

ఒక వ్యక్తి వ్యవస్థగా మారి జాతి మొత్తాన్ని ఏకతాటిపైకి తెచ్చి స్వేచ్ఛ విలువ తెలిపి అహింస, శాంతి అనే రెండు అత్యద్భుత ఆయుధాలను ఇచ్చి నడిపించిన సంగ్రామమిది…

ఎంతో మంది అతివాదులు, మితవాదులు దేశ స్వాంతంత్ర్య సంగ్రామంలో తమ అకుంఠిత దీక్షతో పోరాటాలు సలుపుతున్న వారందరిని సంఘటితపరిచి మహా ఉద్యమంగా మార్చిన మాననీయుడు గాంధీ.

మేధావులు మాట్లాడుతారు … మూర్ఖులు వాదిస్తారు ..

భిన్నాభిప్రాయాలు, భిన్న ప్రాంతాలుగా ఉన్న జాతికి వందేమాతరం అనే నినాదాన్ని నేర్పి భాషలతో సంబంధం లేని అఖండతను అందించిన నేర్పరి గాంధీజీ..

అంతులేని వేదనలతో, తెల్లవారి దౌష్ట్యాలతో అట్టుడికి పోతున్న ప్రజలకు బాసటగా నిలిచి అహింసా యుద్దాన్ని తలపెట్టి రవి అస్తమించని సామ్రాజ్యానికి చరమగీతం పాడిన మహర్షి గాంధీ..

90 సంవత్సరాల సుదీర్ఘ స్వాంతంత్ర్య ఉద్యమం ప్రకాశింపచేసిన ధ్రువ తార మాత్రం గాంధీ అనేది నిర్వివాదాంశం ..

నెల్సన్ మండేలా, ఆంగ్ సాన్ సూకీ, ఒబామా , ఐన్ స్టీన్, క్యాస్ట్రో వంటి ప్రపంచ నేతలు, మలాలా వంటి యువనేతలు కూడా గాంధీజీ స్ఫూర్తితోనే మేము ఇంత వారమయ్యామని అన్నారంటే ఆయన నడిపిన ఉద్యమం ప్రపంచాన్ని ఎంత స్థాయిలో ప్రభావితం చేసిందో తెలుపుతుంది..

“సత్యం ఒకటే జీవితాన్ని సన్మార్గంలోకి తీసుకుని వస్తుంది”..

ధర్మానికి సత్యానికి కట్టుబడి జీవించాలని బోధించి తన నిజ జీవితం లో ఆచరించి చూపిన మహనీయుడు గాంధీ..

వాస్తవానికి జనంలో చైతన్యం తెచ్చి వారిలో మార్పు తీసుకురావటాన్ని విప్లవం అంటే గాంధీ ఖచ్చితం గా విప్లవకారుడు , క్రాంతి కారుడే …

“అందం అనేది నడవడికలో ఉంటుంది .. ఆడంబరాలలో ఉండదు “..

బక్క పలచని ఒక సాధారణ మనిషి మనీషి గా మారి విశ్వాన్ని తన చేతనతో మార్చటం అద్భుతమే అయితే ఇది ఖచ్చితంగా అపురూపమే..

150 సంవత్సరాల భారత చరిత్రను సజీవంగా నిలబెట్టిన స్వాతంత్ర ఘట్టాలకు ప్రత్యక్ష దర్శకుడు నిర్మాత గాంధీని జాతిపిత గా కొలవటం మన ప్రధాన కర్తవ్యం..

_ అట్లూరి వెంకటరమణ
9550776152

గమనిక:

  • WhatsApp లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://bit.ly/3jqXNLp గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
  • Telegram లో జనవిజయం అప్డేట్స్ పొందేందుకు https://t.me/janavijayam ఛానల్ లో జాయిన్ అవ్వండి.