ఖమ్మం, జూలై 31(జనవిజయం): మున్నేరు ముంపు ప్రాంతాల్లో పారిశుద్ధ్య చర్యలు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టర్ మున్నేరు ముంపు ప్రాంతం పద్మావతి నగర్, పెద్ద తాండ ఆర్తికాలనీల్లో పర్యటించి, ముంపు సహాయక చర్యలను తనిఖీ చేశారు. ఇంటింటికి తిరుగుతూ, వరద ఏ మేరకు వచ్చింది, ఏ ఏ నష్టం మేర జరిగింది అడిగి తెలుసుకున్నారు. వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటి జ్వర సర్వే చేపట్టుటకు వచ్చింది లేనిది అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వే చేపట్టి, ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవాలని, నమూనాలు సేకరించి పరీక్షలు చేపట్టాలని అన్నారు. నీటి నిల్వల్లో ఆయిల్ బాల్స్ వేయాలని, దోమల నియంత్రణకై చర్యలు తీసుకోవాలని అన్నారు. వ్యర్థాలు, చెత్త కుప్పలు తొలగించాలని, నీటి నిల్వలు లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. త్రాగునీటిలో క్లోరిన్ మాత్రలు వేసుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ముంపు బాధితులకు ప్రభుత్వం ద్వారా అన్ని రకాల సహాయ చర్యల్ని చేపడతామన్నారు. విద్యుత్, నీటి సరఫరా పునరుద్ధరణ జరిగిందని, రాబోయే 10 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు ఇంటింటికి పంపిణీ చేసినట్లు ఆయన అన్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యాధికారిణి డా. బి. మాలతి, ఖమ్మం రూరల్ ఎంపిపి బెల్లం ఉమ, తహసీల్దార్ సుమ, వైద్యాధికారులు, అధికారులు తదితరులు ఉన్నారు.