Saturday, February 24, 2024
Homeఎడిట్మునుగోడు ఫలితంతో తెలంగాణ భవితవ్యం తేలిందా?!

మునుగోడు ఫలితంతో తెలంగాణ భవితవ్యం తేలిందా?!

(పల్లా కొండలరావు, ఖమ్మం)

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మునుగోడు ఎన్నిక ఫలితం తెలంగాణ భవిష్యత్ రాజకీయ ముఖచిత్రాన్ని తేల్చేసిందా అంటే ‘లేదు’ అనే సమాధానం వస్తోంది. భారతీయ జనతా పార్టీ పెద్దలు దక్షిణాదిలో తమకు తెలంగాణ అనుకూలమా? కాదా? తేల్చుకోవడానికి కొని తీసుకొచ్చిన ఎన్నిక మునుగోడు ఉప ఎన్నిక. అనివార్యంగా తె.రా.సకు కూడా ఇది ఛాలెంజ్ గా తీసుకోవలసి వచ్చిన ఎన్నికయింది. కాంగ్రెస్ కు సంబంధించి ఈ ఎన్నిక అంత ప్రభావవంతం కాదనుకున్నా సిట్టింగ్ సీటును, నాయకులను కాపాడుకోలేని ఆ పార్టీ తీరు మారుతుందా? లేదా అన్నది తేలాల్సే ఉంది. ఫలితం వచ్చాక ప్రధాన పార్టీల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చిందనిపిస్తోంది. డబ్బున్నోడు, ఓటింగ్ ను ప్రభావితం చేయగలిగినోడుంటే తప్ప తెరాసను ఓడించలేరని అవగతమయింది. తెలంగాణలో ప్రజలు కేసీయార్ ను గద్దె దింపాలన్న కసితో 50% కు పైగా ఉన్నారన్నది ఎంత నిజమో.. కేసీయార్ కు ప్రత్యామ్నయంగా ఎవరు? అన్నది నమ్మకంగా తేలక సాపేక్షంగా కేసిఆర్ నే బెటర్ అనే అభిప్రాయం ఉన్నదీ అంతే నిజం

మునుగోడు లో గెలిచి టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నయం అని చెప్పాలని, ఇతర పార్టీలలో బలమైన నేతలను తమవైపు లాక్కుని తెలంగాణలో అధికారంలోకి రావాలన్న ప్రయోగం మేరకు తమ శాయశక్తులా కృషి చేశారు భాజపా నేతలు క్యాడర్ కూడా. ఆ అవకాశం ఉందన్న సంకేతాలు పంపగలిగారు. ప్రజాస్వామ్యానికిది ప్రమాదకరం కాగా ఎన్నికలలో ఓట్లు రాబట్టుకోవడానికి నేడు అనుసరించాల్సిన రాజకీయ వ్యూహం ఏమిటో అర్ధం అయింది. సర్వేల అంచనాలకు మించి భాజపా అభ్యర్ధి ఓట్లు రాబట్టగలిగారు. కామ్రేడ్ల మద్దతు, కాంగ్రెస్ కు ఆమాత్రం ఓటింగ్ రాకుంటే అత్యధికంగా ఓటుకు నోట్లు రాల్చినా, ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతా వాడినా, యావత్ ప్రభుత్వం కేంద్రీకరించి పని చేసినా తెరాసకు వచ్చింది 10వేల మెజారిటీ కావడంతో టీఆర్ఎస్ కూడా హ్యాట్రిక్ కొట్టేంత సేఫ్ జోన్ లో లేదని స్పష్టమైంది. క్షేత్ర స్థాయిలో బలం ఉన్నా, క్యాడర్ ఉన్నా కాంగ్రెస్ లో ఐక్యత లేకపోవడం కారణంగా టీఆర్ఎస్ కు ధీటుగా కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకం కలగకపోవడం ఆ పార్టీ దుస్తితికి అద్దం పడుతోంది. ప్రస్తుతానికి గెలుపు ఊపులో ఉన్నా టీ.ఆర్.ఎస్ కూడా పరిస్తితి అంత తేలిక కాదని అవగాహనకు వచ్చింది. ఇప్పటికే లెఫ్ట్ పార్టీలతో పొత్తు ఉంటుందని మంత్రులు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం. కామ్రేడ్లను కాంగ్రెస్ కలుపుకుంటుందా? టీఆర్ఎస్ నిలుపుకుంటుందా? అన్నది కూడా కీలక అంశమే. కామ్రేడ్లు టీఆర్ఎస్ వైపు వెళితే ప్రధాన పోటీ టీఆర్ఎస్ కూ, భాజపాకు మధ్యనే ఉంటుంది. ఇల్లు చక్కదిద్దుకుని క్యాడర్ లో ధైర్యం నింపి ఐక్యంగా నిలిచి కామ్రేడ్లను ఇతర కలసి వచ్చే శక్తులను కలుపుకోగలిగితే మాత్రం పోటీ టీఆర్ఎస్ కూ కాంగ్రెస్ కూ మధ్యనే ఉంటుంది. భాజపా మూడోస్ధానానికి పరిమితం కాక తప్పదు. కాంగ్రెస్, టీఆర్ఎస్ లలోని బడా నేతలను భాజపా లాక్కోగలిగితే మాత్రం పోటీ టీఆర్ఎస్ కూ , భాజపా కు మధ్య ఉంటుంది. ప్రధాన పోటీ ఎవరి మధ్య అన్నది ఇప్పటికిపుడే చెప్పగలిగే పరిస్థితి మాత్రం లేదు. ఏమైనా సరే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మాత్రం ఎన్నికల బరిలో సవాల్ చేసే స్థితిలోనే ఉంటుంది కనుక తెలంగాణలో త్రిముఖ పోటీ తప్పదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ఈ వారం పాపులర్

ఆల్ టైమ్ పాపులర్

Recent Comments