ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- ఎస్పీ డా.వినీత్.జి
భద్రాద్రి కొత్తగూడెం, జూలై 20 (జనవిజయం):
గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాదస్తాయికి చేరుకుంటుంది. కావున గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డా.వినీత్.జి ఐపిఎస్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ప్రజలు ఎవరూ భయబ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు. అన్ని శాఖల అధికారులతో సమన్వయం పాటిస్తూ జిల్లా పోలీసు యంత్రాంగం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. గోదావరి నది ఉదృతిని గమనిస్తూ ప్రజలు అధికారుల సూచనలను పాటిస్తూ పోలీస్ వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆపదలో ఉంటే వెంటనే డయల్ 100కు కాల్ చేసి పోలీసు వారి సహాయం తీసుకోవాలని ఎస్పీ సూచించారు.