ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో పాల్గొనాలి
- ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం, జూలై 22(జనవిజయం) :
ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు పాత్ర ఎంతో కీలకమైనందున అర్హులైన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటింగ్ లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఓటరుకు ఓటింగ్ పై అవగాహనకు ఏర్పాటుచేసిన అవగాహన, సంచార ప్రదర్శన రథాలను, కలెక్టర్ స్థానిక పాత బస్టాండ్ వద్ద జెండా వూపి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలో జరుగనున్న సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అర్హులైన ఓటర్లు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా స్వీప్ కార్యక్రమంలో భాగంగా విస్తృత స్థాయిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. ఓటింగ్ ఆవశ్యకతను వివరిస్తూ, పోలింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు జిల్లాలో శాసనసభా నియోజకవర్గాల వారీగా ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి రెండు చొప్పున సంచార రథాల (మొబైల్ వాహనాల) ద్వారా గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయించనున్నట్లు ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు విశేష ప్రాధాన్యం వుందని, ఓటు హక్కు నిర్భయంగా వినియోగించుకొనే అవకాశం ఎన్నికల సంఘం కల్పిస్తోందని ఆయన తెలిపారు. ఓటు హక్కు నమోదు అయింది, లేనిది గ్రామాల్లో అంగన్వాడి టీచర్లు, పంచాయితి కార్యదర్శులు, గ్రామ రెవెన్యు సహాయకుల నుండి, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్ బిల్ కలెక్టర్ల ద్వారా తెలుసుకోవాలని, ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటు హక్కుకు దరఖాస్తు చేయాలని ఆయన తెలిపారు.
2023 అక్టోబర్ 01వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న వారంతా ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన అన్నారు. ఈవీఎంల పనితీరుపై అవగాహన కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఖమ్మం ఐడివోసి, మునిసిపల్ కార్పోరేషన్ కార్యాలయాల్లో, నియోజకవర్గ కేంద్రాల తహసిల్ కార్యాలయాల్లో ఇట్టి అవగాహన కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఈ కేంద్రాలను సందర్శించి ఓటింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహనను ఏర్పర్చుకోవడంతో పాటు ఈవీఎం, వివి.ప్యాట్ ల పనితీరుపై అవగాహన, ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, ఎన్. మధుసూదన్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, ఎస్డిసి దశరథం, ఖమ్మం అర్బన్, రూరల్ తహసిల్దార్లు శైలజ, సుమ, కలెక్టరేట్ ఎన్నికల పర్యవేక్షకులు రాంబాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.