తగ్గుముఖం పట్టిన గోదావరి వరద
భద్రాచలం, జూలై 21(జనవిజయం):
భద్రాచలం వద్ద గోదావరి వరద స్వల్పంగా తగ్గు ముఖం పట్టింది. శుక్రవారం ఉదయంకు ఒక అడుగు వరద నీరు తగ్గినట్లు అధికారులు తెలిపారు. రాత్రి 44.30 అడుగులు ఉన్న వరద ఉదయం 7 గంటలకు 43.90 అడుగులుకు చేరింది.
గోదావరి నుండి 9 లక్షల 71 వేల 134 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు కలెక్టర్ ప్రియాంక. అలా పేర్కొన్నారు. 20వ తేది రాత్రి 10 గంటలకు 44.30 అడుగులు వచ్చిన గోదావరి ఈ రోజు ఉదయం 6 గంటలకు 43.90 అడుగులకు చేరిందని చెప్పారు. లక్ష్మీ బ్యారేజి మరియు సమ్మక్క బ్యారేజిల నుండి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టినందున నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ముంపుకు గురైన కొత్తకాలనీలోని 24 కుటుంబాలకు చెందిన 90 మందిని పునరావాస కేంద్రానికి తరలించినట్లు చెప్పారు. ఎలాంటి అవాంఛ నీయ సంఘటలు చోటు చేసుకోలేదని, ప్రజలు ప్రభుత్వ యంత్రాంగపు సలహాలు, సూచనలు పాటిస్తూ రక్షణ చర్యలకు సహకరిస్తున్నారని చెప్పారు.
పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే వరకు ప్రజలు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని ప్రజలకు సూచించారు. వర్ష సూచనతో పాటు మొదటి ప్రమాద హెచ్చరిక అమల్లో ఉన్నదని కాబట్టి అధికార యంత్రాంగం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డా ప్రియాంక అల సూచించారు.